సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పేరు మరోసారి వార్తల్లోకి వస్తోంది! విచిత్రం ఏంటంటే.. ఈ మధ్య ఎప్పుడు ఆయన పేరు ప్రముఖంగా వినిపించినా అది పార్టీ మార్పు నేపథ్యంలోనే కావడం విశేషం! ఆయన పార్టీ మారతారంటూ ఈ మధ్యనే ఓ రెండుసార్లు వరుసగా ప్రచారం జరిగింది. తెరాసలోకి వచ్చిన తరువాత తగిన గుర్తింపు లభించడం లేదనీ, అందుకే భాజపావైపు ఆయన చూస్తున్నారంటూ కథనాలు వచ్చాయి. అయితే, వాటిని ఆయన ఖండించారు. అలాంటి ఆలోచనలేవీ లేవని తేల్చి చెప్పేశారు. కానీ, కొద్దిరోజుల కిందటే డీఎస్ కుమారుడు అరవింద్ కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంలో తనయుడి బాటలోనే తండ్రి కూడా పయనిస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. వాటిపై కూడా డీఎస్ స్పందించాల్సి వచ్చింది. తన కుమారుడు పార్టీ మారడం అనేది అరవింద్ వ్యక్తిగత విషయం అవుతుందనీ, ఎవరి రాజకీయ విధానాలు వారివి అంటూ వివరణ ఇచ్చుకున్నారు. దాంతో డీఎస్ పార్టీ మార్పు చర్చకు ఫుల్ స్టాప్ పడిందని అనిపించింది.
ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ సీన్ మెల్లగా మారుతున్న సంగతి తెలిసిందే! ఇన్నాళ్లూ డీఎస్ భాజపా వైపు చూస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు సొంత గూటివైపు మళ్లే అవకాశం ఉందని ఆయన అనుచరగణంలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. పార్టీ మార్పు కథనాల నేపథ్యంలో తెరాస అధినాయకత్వం నేరుగా ఆయన్నే పలుమార్లు ప్రశ్నించినట్టు చెబుతున్నారు. ఇలాంటి పుకార్లు పదేపదే ఎందుకు వినిపిస్తున్నాయంటూ ఆయన్నే ప్రశ్నించారని, ఒక సీనియర్ నేతకు ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదని అనుచరులు గుర్రుగా ఉన్నారట. తెరాసలో డీఎస్ కు మొదట్నుంచీ ఆశించిన స్థాయి గౌరవం దక్కడం లేదని అనుచరులు మరోసారి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. ఈ తరుణంలో అనుచరులతోపాటు కొంతమంది డీఎస్ కు సలహాలు ఇస్తున్నారనీ, ఇతర పార్టీల వైపు చూసే కంటే సొంత గూటికి వస్తేనే గతంలో దక్కిన ప్రాధాన్యత మళ్లీ దక్కుతుందని అభిప్రాయపడుతున్నారట. ఒకవేళ భాజపాలో చేరినా ఇప్పుడు తెరాసలో ఉన్నట్టుగానే ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కకపోవచ్చనీ, అందుకే కాంగ్రెస్ వైపు వెళ్లడమే మంచిదనే అభిప్రాయం డీఎస్ ప్రధాన అనుచరుల నుంచి వ్యక్తమౌతున్నట్టు సమాచారం. తెలంగాణ కీలక నేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం, ఆయనతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా భారీగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైపు డీఎస్ చూస్తున్నారంటూ వినిపించడం విశేషం! ఏదేమైనా, మరోసారి డీఎస్ పార్టీ మార్పు వ్యవహారం చర్చనీయం కాబోతోంది. గతంలో మాదిరిగానే మరోసారి వివరణ ఇస్తారా..? లేదా, గతంలో మాదిరిగానే మీడియాకు మరోసారి క్లాస్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.