రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు… డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతున్నప్పుడు… సినిమావాళ్ల పిల్లలు సినిమాల్లోకి వస్తే తప్పేంటి? ఇండస్ట్రీలో వారసుల సంఖ్య ఎక్కువ అవుతోందనీ, ఇతరులకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని విమర్శలు వచ్చినప్పుడు సినిమా జనాల నుంచి వినిపించే మాట! ప్రతి రంగంలోనూ వారసుల ప్రస్తావన వస్తే… ఎక్కువగా అబ్బాయిల పేర్లు వినిపిస్తాయి. అమ్మాయిల ప్రస్తావన తక్కువ వినిపిస్తుంటుంది. చాలామంది సినిమా జనాలు తమ అమ్మాయిలను సినిమా రంగంలోకి పంపించడానికి సంశయిస్తున్న రోజులివి. అటువంటిది ఒక రాజకీయ నేత కుమార్తె దర్శకురాలిగా వస్తుండటం అంటే విశేషమే కదా! వివరాల్లోకి వెళితే… శ్రియ, నిహారిక ప్రధాన తారాగణంగా సోమవారం ఓ సిన్మా ప్రారంభమైంది. ఈ సినిమా దర్శకురాలు సుజనా ఎవరో కాదు… తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోని కూకట్పల్లి నియోజకవర్గ నేత గొట్టిముక్కల పద్మారావు కుమార్తె. దర్శకురాలిగా ఆమెకు తొలి చిత్రమిది. కుటుంబం నుంచి ఆమెకు పూర్తి మద్దతు లభిస్తోంది. చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిన తల్లిదండ్రులు కుమార్తెను ఆశీర్వదించారు. సాధారణంగా సినిమా జనాలు రాజకీయాల్లోకి వెళ్తుంటారు. రాజకీయాల నుంచి సినిమాల్లోకి వచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు.