రేవంత్ రెడ్డికి బీసీ సర్టిఫికెట్ జారీ చేసేశారు… తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్. ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనూహ్యంగా రేవంత్ రెడ్డిని పొగడటం ప్రారంభించారు. రేవంత్.. రెడ్డి సామాజికవర్గంలో పుట్టినప్పటికీ.. బడుగు, బలహీనవర్గాల వారికీ… చేతికర్రగా మారారని ప్రశంసల వర్షం కురిపించారు. స్వామిగౌడ్ మాటలు విని ఒక్క సారిగా అందరూ అవాక్కయ్యరు. ఎందుకంటే.. ఆయన టీఆర్ఎస్ నేత మరి. టీఆర్ఎస్కు నెంబర్ వన్ శత్రువు ఎవరు అంటే.. రేవంత్ రెడ్డి.. అలాంటి రేవంత్ రెడ్డిని.. శాసనమండలి చైర్మన్గా చేసిన స్వామిగౌడ్ పొగడటం అంటే… సమ్థింగ్.. సమ్థింగ్ అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి.
ఎవరు ఔనన్నా.. కాదన్నా టీఆర్ఎస్కు… కేసీఆర్కు.. కేటీఆర్కు ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డినే కనిపిస్తున్నారన్న నమ్మకం ఇప్పుడిప్పుడే అన్ని పార్టీల నేతల్లో ఏర్పడుతోంది. ఇప్పుడు ఉన్న చోట తమకు ప్రాధాన్యత దక్కని వాారు. నేరుగా రేవంత్ వద్దకు చేరుతున్నారు. చాలా మంది పరోక్షంగా… స్వామిగౌడ్ వంటి వారు ప్రత్యక్షంగా చేరుతున్నట్లుగా తెలుస్తోంది. మూడు రోజుల కిందట.. ఇదే స్వామిగౌడ్.. తెలంగాణలో ఒకే కులం లేకపోతే.. కన్ని కులాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు. ఆ మాటలు కేసీఆర్ తో పాటు కాంగ్రెస్కు కూడా తగిలాయి. టీఆర్ఎస్ లో వెలమ… కాంగ్రెస్లో రెడ్డి నేతలు మాత్రమే అందలం ఎక్కుతూంటారు.
ఇప్పుడు..తాను అన్న మాటలకు కట్టుబడుతూనే.. రేవంత్ కు మాత్రం.. బలహీనవర్గాల ట్యాగ్ ఇచ్చేస్తున్నారు స్వామిగౌడ్. అంటే.. ఆయనకు పదవి వస్తే.. బలహీనవర్గాలకు వచ్చినట్లేనని చెప్పడం స్వామిగౌడ్ ఉద్దేశం అంటున్నారు. రేవంత్ ను బహిరంగంగా పొగడతంతో ఆయనను ఏ క్షణమైనా టీఆర్ఎస్ నుంచి బయటకు పంపేసే అవకాశం ఉంది. అయితే… అలా చేయడం ఆయనకు మరింత చాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. సస్పెండ్ చేస్తే ఆయన టీఆర్ఎస్ పై మరింత ఎక్కువగా దాడి చేయవచ్చు. ఎందుకంటే.. ఆయన సకలజనుల సమ్మెలో కీలకంగా వ్యవహరించారు. స్వామిగౌడ్ ను డీల్ చేయడం… టీఆర్ఎస్కు కత్తిమీద సామే.