కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అనే స్లోగన్లను టీఆర్ఎస్ నేతలు మళ్లీ ప్రారంభించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎవరూ అడగకపోయినా ప్రకటించారు. కేటీఆర్ కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ బీజేపీని ఎదుర్కొనేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని చెప్పారు. ఆ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని స్పష్టం చేశారు. వందకు వంద శాతం రాష్ట్రానికి నెక్ట్స్ సీఎం కేటీఆరే అని..ఈ విషయాన్ని పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు.
నిజానికి ఇప్పటిప్పుడు కేసీఆర్ రాజీనామా చేసి.. కేటీఆర్‌కు బాధ్యతలిచ్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పలేదు. మునుగోడు ఉపఎన్నికల్లో గెలిస్తే.. మంచి పాజిటివ్ వేవ్ వస్తుది కాబట్టి.. బాధ్యతల్ని కేటీఆర్‌కు ఇచ్చి తాను పూర్తి స్థాయిలో ఢిల్లీ రాజకీయాలు చేయాలనుకుంటున్నారేమో కానీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదే అర్థంలో కామెంట్లు చేశారు. అయితే మునుగోడు ఉపఎన్నిక తర్వాత మరో ఏడాది కూడా అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉండదు. అలా కేసీఆర్ వైదొగలడం..కేటీఆర్‌కు బాధ్యతలివ్వడం రిస్క్‌తో కూడుకున్న పని అవుతుందన్న అంచనా ఉంది.
కేసీఆర్ ఇంత వరకూ కేటీఆర్ సీఎం అనే అంశంపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. గతంలో ఓ సారి.. మంత్రులు సహా పార్టీ క్యాడర్ మొత్తం.. కేసీఆర్ ఇక కేటీఆర్‌కు బాధ్యతివ్వాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ ఆగ్రహంతో తర్వాత ఆ వ్యాఖ్యలు ఆగిపోయాయి. ఇప్పుడు మరోసారి ప్రారంభమయ్యాయి. కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు కేసీఆర్. పాలనా వ్యవహారాలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.