తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అయోధ్య విరాళాల అంశాన్ని అదే పనిగా వివాదం చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలతో రచ్చ జరిగింది. తర్వాత ఆయన క్షమాపణ చెప్పి.. తోచినంత విరాళం ఇచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యతను పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీసుకున్నారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తూ… రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని విమర్శలు వినిపించారు. దేవుడి పేరుతో ఇష్టానుసారం వసూళ్లు చేస్తున్నారని .. పటేల్ విగ్రహానికి వేలకోట్లు పెట్టారు.. రాముడిగుడి నిర్మించలేరా అని ప్రశ్నించారు. అంతే కాదు.. అసలు వసూలు చేసిన సొమ్ములకు లెక్కలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. లెక్కలు చెప్పి తీరాల్సిందేనని ఆయన అంటున్నారు.
ధర్మారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆందోళనలు చేయడం కామనే. దానికి తగ్గట్లుగానే ఆయన ఇంటిపైకి బీజేపీ కార్యకర్తలు ధర్నాకు వెళ్లారు. ఇంటిపై కోడిగుడ్లు విసిరేశారు. ఈఫలితంగా పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించాల్సి వచ్చింది. ధర్మారెడ్డి … కోరుట్ల ఎమ్మెల్యేలా కాకుండా విరాళాలలకు లెక్కలు చెప్పాలని అడుగుతున్నారు. బీజేపీ నేతలు ఊరూవాడా చందాలు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులన్నీ ఎటు పోతున్నాయి… నిజంగానే అయోధ్య రామాలయానికి పంపుతున్నారా లేదా అన్నది విరాళాలు ఇస్తున్న వారిలోనూ సందేహం ఉంది. ఇటీవల కొంత మంది నేతలు సొంతగా రాముడి విరాళాల కోసం పుస్తకాలు ముద్రించి డబ్బులు వసూలు చేస్తున్నారు.
దీనిపై అయోధ్య రామాలయ ట్రస్ట్ కూడా స్పందించింది. అలాంటి విరాళాల సేకరణ చట్ట విరుద్ధమని.. పోలీసులకుఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. కానీ వసూళ్లు మాత్రం ఎవరు పడితే వారు చేస్తున్నారు. చోటా బీజేపీ నేతలందరూ అదే పనిలో ఉంటున్నారు. దాదాపుగా ప్రతీ ఇంటి నుంచి చందా వసూలు చేస్తున్నారు. వాటి లెక్కలపై మాత్రం క్లారిటీ ఉండటం లేదు.