తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లవుతోంది. ఆ పార్టీ నేతలు తమకు ఎదురులేదన్నట్లుగా చెలరేగిపోతున్నారు. వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ప్రజల్ని ప్రశాంతంగా ఉండనీయడం లేదు . ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూడటం టీఆర్ఎస్ పెద్దల్ని సైతం ఆందోళనకు గురి చేస్తోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేసిన ఘనకార్యం చాలా రోజులు ప్రజల్లో చర్చకు కారణం అయింది. ఆ ఘటన పార్టీ ఇమేజ్ను నవ్వులపాలు చేసిందని చాలా మంది టీఆర్ఎస్ నేతలు బాధపడ్డారు. ఇప్పుడు అలాంటివి వరుసగా బయటపడుతున్నాయి.
రామాయంపేటలో ఓ తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి మున్సిపల్ చైర్మన్ కారణం అని సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అప్పటి వరకూ ఆ మున్సిపల్ చైర్మన్.. టీఆర్ఎస్ నేతల అరాచకాలపై ఓపిక పట్టిన ప్రజలు దీంతో ఒక్క సారిగా తిరుగుబాటు చేశారు. ఆ శవాల్ని టీఆర్ఎస్ నేతల ఇళ్లలోకి తీసుకెళ్లి ఆందోళన చేశారు. ఇంత తిరుగుబాటును పోలీసులు కూడా ఊహించలేదు. అదే సమయంలో ఖమ్మంలోనూ అదే తరహా ఘటన చోటు చేసుకుంది. తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి కేటీఆర్ తన పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు.
ఖమ్మంలో మంత్రి పువ్వాడ వ్యవహారశైలిపై మొదటినుంచి విమర్శలు ఉన్నాయి. పొరుగు రాష్ట్ర నేతల్ని ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా అందరిపై కేసులు పెట్టిస్తున్నారని… విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అవి ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఖమ్మం మొత్తం పువ్వాడపై తీవ్రమైన వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఇవి సంచలనం సృష్టిస్తున్నవే. ఇక స్థానికంగా ప్రతీ చోటా టీఆర్ఎస్ నేతలు తాము చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రజల్ని వేధిస్తున్న ఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి అరాచక నేతల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్కు నష్టమే.