తెలంగాణ రాష్ట్ర సమితిలో పట్టలేనంత మంది నేతలు ఉన్నారు. ఒక్కో నియోజకవర్గానికి పది మంది అభ్యర్థులు.. ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించేవాళ్లు ఉన్నారు. వారిలో అట్టడుగున ఉండేది.. టీఆర్ఎస్లో మొదటి నుంచి పని చేస్తున్నవాళ్లు. టీఆర్ఎస్ పార్టీకి దిక్కూదివాణం లేని నియోజకవర్గాల్లో జెండాలు కట్టి.. వారు చిట్ట చివరన ఉన్నారు. బంగారు తెలంగాణ పేరుతో పార్టీలోకి వచ్చిన వారు పైన ఉన్నారు. వారందరికి టిక్కెట్లు ఖరారయ్యాయి. ఒక్క వరుసకు మాత్రమే ఖరారయ్యాయి. మిగతా తొమ్మిది మంది ఏం చేయాలి..? వారిలో.. ఒక్కో నియోజకవర్గానికి నలుగురు.. నాది ఎమ్మెల్యే స్థాయి. ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసే గెలిచే సత్తా ఉందని నమ్మే లీడర్లు ఉన్నారు. వాళ్లెందుకు.. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే అవకాశాన్ని వదులుకుంటారు.
అందుకే.. ఒక్కసారిగా టిక్కెట్లు ప్రకటించి… షాక్ ఇచ్చిన కేసీఆర్‌కు.. తాము రెగ్యులర్‌గా ఏదో ఓ షాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. బల ప్రదర్శన చేస్తున్నారు. ఇండిపెండెట్లుగా నిలబడతామని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానిక నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఖమ్మ జిల్లా వైరా నియోజకవర్గం పార్టీ టికెట్‌ను తాజా మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మదన్‌లాల్‌కు కేటాయించడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన మదన్‌లాల్‌కు మరోసారి అవకాశం ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు వైరా నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల టీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం సమావేశమయ్యారు. టిక్కెట్ ఆశించిన ఓ నేత.. నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. ఇక కొండా సురేఖ సంగతి చెప్పాల్సిన పని లేదు.
ఆదిలాబాద్ నుంచి.. నల్లగొండ వరకూ.. ఈ సమస్య ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో టీడీపీ తరపున ఒకప్పుడు చక్రం తిప్పిన రమేష్ రాథోడ్.. కొన్నాళ్ల క్రితం టీఆర్ఎస్లో చేరారు. ఖానాపూర్ టిక్కెట్ ఇస్తామని.. హామీ ఇచ్చి .. పార్టీలో చేర్చుకున్నారని.. ఇప్పుడు ఇవ్వలేదని.. ఆగ్రహం వ్యక్తం చేసిన రమేష్ రాథోడ్.. భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అంతేనా.. మల్కాజిగిరి టిక్కెట్ ఆశిస్తున్న గ్రేటర్ టీఆర్ఎస్ చీఫ్.. మైనంపల్లి హన్మంతరావు కూడా..తన అనుచరులైన కార్పొరేటర్లతో సహా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీళ్లు ఇప్పటికిప్పుడు బయటపడుతున్నారు. కానీ ప్రతి నియోజకవర్గంలో ఈ వ్యవహారం ఉంది. రోజులు గడిచేకొద్దీ బయటకు వస్తాయి. ఎన్నికల వేడి పెరిగే కొద్దీ ఆ సెగ కేసీఆర్‌కే తగలబోతోంది. అందుకే.. కాస్తంతైనా రిలీఫ్.. పొందుదామని.. లిస్ట్ వేరు.. బీఫామ్స్ లెక్క వేరనే లీకుల్ని పంపుతున్నారు. ఇప్పటికే మేయర్ బొంతు రామ్మోహన్ ను సంతృప్తి పరిచేందుకు.. ఉప్పల్ అభ్యర్థిని మారుస్తారని…మీడియాకు సమాచారం ఇచ్చేశారు. ఇలాంటివి ముందు ముందు చాలా ఉండబోతున్నాయి. అంతిమంగా.. ఈ అసంతృప్తి అగ్గి టీఆర్ఎస్ను కాల్చేస్తుందో.. బయటపడేస్తుందో చూడాలి..!