రాష్ట్రపతి ఎన్నికలయ్యాక ఈడీ తెలంగాణలో డ్యూటీ ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ పద్దతుల ద్వారా సేకరించిన సమాచారంతో మొత్తం కార్యాచరణ ఖరారు చేసుకున్నారని చెబుతున్నారు. ఈడీ సోదాలు చేయాలంటే ముందుగా కేసులు నమోదు అయ్యాయని చెప్పాల్సిన పని లేదు. తమ వద్ద ఉన్న అవకతవకల సమాచారంతో వారు సోదాలు చేయవచ్చు. ఆ సోదాల్లో సాక్ష్యాలను పట్టుకోవచ్చు. లేకపోతే లేదు. కానీ ఓ పానిక్ క్రియేట్ అవడం మాత్రం ఖాయం.
తమపై ఐటీ, ఈడీ దాడులు జరగడం ఖాయమని టీఆర్ఎస్ పెద్దలు కూడా భావిస్తున్నారు. రెండు, మూడు కేసులు పెట్టుకోవచ్చని కేసీఆర్ కూడా ఓ సందర్భంలో అన్నారు. బహుశా ఈ అంశంపై స్పష్టమైన సమాచారం ఉండటం వల్లే అని ఉంటారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే నేరుగా సీఎంపై కేసులు పెడితే సంచలనం అవుతుంది. పరిస్థితి అంత వరకూ రాదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఆర్థికంగా అనుచిత లబ్ది పొందిన వారిపై దృష్టి పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందులో ఖచ్చితంగా టీఆర్ఎస్ నేతలుంటారని అంటున్నారు.
తెలంగాణలో ఎన్నికల వేడి పెరిగింది. మరో పదిహేను నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. బీజేపీ ఏం చేయాలనుకున్నా ఇప్పటి నుండే కార్యాచరణ ప్రారంభించాల్సి ఉంది. అందుకే రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ముహుర్తం ఖరారు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ గాలి ఉందని అనిపించాలంటే.. చేరికలు పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది. వాటి కోసమే ఇప్పుడు గ్రౌండ్ వర్క్ జరుగుతోందని రాజకీయవర్గాలు ఓ నిర్ణయానికి వస్తున్నాయి.