తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తోంది. ఎన్నికల సమయంలో టిక్కెట్టు రాక కార్పొరేషన్లకు, పలు నామినేటెడ్ పోస్టులకు హామీలు పొందిన నాయకులంతా ఇప్పుడు ఆ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒకే ఒక్క కేంద్ర స్థానం ఉండేది. వివిధ పదవులు ఆశిస్తున్న వారెవరైనా కేంద్ర స్థానంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చుట్టూనే తిరిగే వారు. ఎన్నికల అనంతరం ఈ కేంద్ర స్థానం రెండుగా మారిపోయింది. ఒకటి సీఎం కేసీఆర్ పాలనా యంత్రాంగం నడిపించే ప్రగతి భవన్ అయితే మరొకటి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చక్రం తిప్పే తెలంగాణ భవన్ గా మారింది. దీంతో వివిధ పదవులు ఆశిస్తున్న వారు ఈ రెండు కేంద్ర స్థానాల మధ్య అటు ఇటు తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ బంతాటలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను ఎవరిని ముందు కలవాలి… ఎవరిని తర్వాత కలవాలి అనే అంశం వేధిస్తోంది అంటున్నారు. రెండు భవన్ లలోనూ ఉన్న వేగులు చీమ చిటుక్కుమన్నా ఆ విషయాన్ని తమ అధినాయకులు ఇద్దరికీ చేర వేస్తున్నారని అంటున్నారు. ఎవరైనా నాయకులు తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిస్తే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య మంత్రిని కలిసిన నాయకులతో “పెద్దాయన్ని కలిశారట. మంచిగున్నారా..!” అని నర్మగర్భంగా ప్రశ్నిస్తున్నారట. పోనీ అని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఇంకొందరు కలిస్తే “చీటికీ మాటికీ ప్రగతి భవన్ కి వెళ్తున్నారట. పెద్దాయన సీరియస్ అవుతున్నారు” అని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి అంటున్నారు. ఇలా కుడి ఎడమల దరువులతో పదవులు ఆశిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కూడా ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు అని వారి అనుయాయులు చెబుతున్నారు.