ఇచ్చిన హామీలు వందశాతం నెరవేర్చాలనీ, అవినీతి ఏ స్థాయిలో కనిపించినా సహించేది లేదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేతలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. కొత్త మున్సిపల్ చట్టం వస్తుందనీ, ప్రజలకు జవాబుదారీతనంగా నాయకులు వ్యవహరించాలని చెబుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే తరహాలు ఈ మధ్య వ్యాఖ్యలు చేస్తుండేసరికి ఎమ్మెల్యేలు, కిందిస్థాయి నాయకుల్లో కొంత చలనమైతే వచ్చింది. దీంతో తాజాగా మున్సిపాలిటీల్లో గెలిచినవారు, కొందరు ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్ చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలుపెట్టారు! ఆయన కోసం ప్రగతి భవన్లో పడిగాపులు కాస్తున్నారని సమాచారం! ఆయన కోసం ఎందుకూ అంటారా… నిధుల కోసం!
రెండోసారి తెరాస అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఇంతవరకూ జరగలేదు! అవి చాలవన్నట్టుగా… మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరిన్ని హామీలను గుప్పించారు. అన్నీ కాకపోయినా కొన్నింటినైనా కార్యరూపంలో చూపించాల్సిన అవసరం ఉందనేది నేతల అభిప్రాయం. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత ప్రజలు తమని కలుస్తున్నారనీ, సమస్యలు చెబుతున్నారనీ వెంటనే ఏదో ఒకటి చెయ్యకపోతే తమపై ఒత్తిడి పెరుగుతుంది అంటూ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి తమకు నిధుల విడుదల తగ్గిపోయిందనీ, కనీసం రాబోయే బడ్జెట్లోనైనా పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయించుకోవాలనేది నాయకుల ప్రయత్నంగా తెలుస్తోంది.
ఈనెల మూడోవారంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతున్న నేపథ్యంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నిధుల కోసమే నేతలు కేటీఆర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో స్థానికంగా మేనిఫెస్టోలను నేతలు విడుదల చేశారు. వాటిని నెరవేర్చాలన్నా, చాన్నాళ్లుగా పెండింగ్ ఉన్న పనులు పునః ప్రారంభించాలన్నా పెద్ద మొత్తంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. శాఖాపరంగా మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో, బడ్జెట్ లో భారీ వాటా దక్కించుకునే ప్రయత్నం ఎలా చేస్తారో చూడాలి?