ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. తెలంగాణలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ప్రభుత్వం. అత్యవసరమైతే తప్ప, ఇళ్లు దాటి బయటకి రావొద్దంటూ ప్రజలకు సూచిస్తోంది. అధికార పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు రాజధాని హైదరాబాద్ వదలి బయటకి వెళ్లడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటున్నారు. చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులూ ఇక్కడికే చేరిపోయారు. సొంత నియోజక వర్గాల్లో ఏదైనా అవసరం ఉంటే ఫోన్లలో మాత్రమే మాట్లాడుతున్నారు! తప్పదు అనుకుంటే ఎవ్వరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఇలా సొంతూరికి వెళ్లి, అలా వెంటనే తిరిగి వచ్చేస్తున్నారని సమాచారం. అయితే, ఇదంతా కరోనా ప్రభావం కాదనీ, కారణం వేరే ఉందని తెరాస వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఫిబ్రవరి రెండో వారంలో ఛత్తీస్ గఢ్ పోలీసులు ఒక ఆపరేషన్ చేపట్టారు. ఆ రాష్ట్రంలో ఉన్న నాలుగు మావోయిస్టు యాక్షన్ టీమ్ ల లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరిగింది. ఆ రాష్ట్ర పోలీసుల చర్యతో ఆ నాలుగు గ్రూపులకు చెందినవారు సరిహద్దు ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలస వెళ్లినట్టు సమాచారం. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాలకు తరలి వచ్చినట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల పోలీసులు పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆయా జిల్లాలకు చెందిన నాయకులు, మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో ఏ కార్యక్రమానికి వెళ్లాలన్నా, ముందుగా సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు ఆదేశించినట్టు సమాచారం.
ఈ కారణంతోనే తెరాస నేతలు హైదరాబాద్ దాటడం లేదని తెలుస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండే మంత్రి ఎర్రబెల్లి, ఈ మధ్య కనిపించడం లేదు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ కూడా హైదరాబాద్ లో ఉంటున్నారో, ఎక్కడ ఉంటున్నారో తమకు తెలీదని కార్యకర్తలు అంటున్నారు. మాజీ ఎంపీ కవితను కూడా నిజామాబాద్ కి కొన్నాళ్లపాటు రావొద్దంటూ పోలీసులు చెప్పారని సమాచారం. అసలు కారణం అదన్నమాట.