ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రజలను బస్సులు పెట్టి మరీ గత టీడీపీ సర్కారు తరలించిన సంగతి తెలిసిందే. పోలవరంలో ఏ పనులూ జరగడం లేదంటూ నాటి ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టడం కోసం టీడీపీ ఆ పని చేసింది. ఇప్పుడు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుల టూర్లు మొదలయ్యాయి! అయితే, ఇది అధికార పార్టీ ప్రోత్సహిస్తున్న పర్యటనలు కాకపోవడం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పడాలనీ, ఆయన్ని ఇంప్రెస్ చేయడం కోసం ఇలాంటి టూర్లు ప్రారంభం కావడం విచిత్రం! ఇంతకీ, కాళేశ్వరం టూర్లు ప్రోత్సహిస్తున్నది ఎవరంటే… ఇద్దరూ మాజీ డెప్యూటీ సీఎంలే. వారెవరంటే.. కడియం శ్రీహరి, రాజయ్య.
ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు వరంగల్ జిల్లాలో ఎప్పట్నుంచో ఉన్నదే. ఎప్పటికప్పుడు తెరమీదికి వస్తూనే ఉంటుంది. ఈసారి ఈ ఇద్దరూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో ప్రత్యేకంగా పడేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలనీ, గొప్పతనాన్ని ప్రజలు వివరించడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కార్యకర్తలు, ప్రజల్ని తీసుకెళ్లాలని కడియం ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే, ఆయన ప్రకటించిన వెంటనే… ఎమ్మెల్యే రాజయ్య కూడా అదే తరహా ప్రోగ్రామ్ ప్రకటించారు. కడియం కంటే ఒక రోజు ముందుగానే ఆయన కొంతమందిని తీసుకెళ్లిపోయి, కేసీఆర్ గొప్పతనం గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. ఒకే పార్టీకి చెందినవారు, ఒకే నియోజక వర్గానికి చెందిన నాయకులు ఎవరికివారు టూర్లు పెట్టుకోవడం ఇప్పుడు తెరాసలో చర్చనీయం అవుతోంది.
ముఖ్యమంత్రి దృష్టిలో పడటానికి ఇన్ని అవస్థలు అవసరమా? ఇద్దరూ సీనియర్ నాయకులే కదా. కేవలం వారి ఆధిపత్యాన్ని ముఖ్యమంత్రి ముందు ప్రదర్శించడానికి తప్పితే, ఈ పర్యటనల వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? వారి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే తప్ప… ప్రజలకుగానీ, పార్టీకిగానీ ఏరకంగానూ ఇది పనికిరాదు. సరే, ముఖ్యమంత్రిని ఇంప్రెస్ చేయడమే వారి ఏకైక లక్ష్యమే అనుకుందాం. అలాంటప్పుడు, పార్టీ తరఫున ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టొచ్చు కదా? నియోజక వర్గంలో స్వచ్ఛందంగా అన్నదానాలో, మెడికల్ క్యాంపులో, పేద విద్యార్థులకు అండగా నిలిచి చదివించడం… ఇలాంటి అంశాల్లో పోటీ పడితే కొంతైనా ఉపయోగం ఉంటుంది కదా! ప్రజల్లో కూడా మంచి పేరు వస్తుంది. దాంతో సహజంగానే పార్టీ నుంచి గుర్తింపు వస్తుంది కదా.