టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటల కారణంగా దేత్తడి హారిక మానసిక క్షోభకు గురి కావాల్సి వచ్చింది. తనకు టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు వచ్చిందని .. పదవి ఇచ్చినప్పుడు ఆమె సంతోషపడ్డారు. అయితే.. ఆమె నియామకంగా చెల రేగిన వివాదంతో… మనస్థాపానికి గురయ్యారు. తాను ఆపదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. అయితే టీఆర్ఎస్లో మాత్రం.. హారిక నియామకం ప్రకంపనలు ఆగడం లేదు. అసలు ఈ వివాదంలో హారికకు సంబంధమే లేదు. ఆమెను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా నియమించారు. ఆయనకు ఎలా ఎందుకు నియమించాలని అనిపించిందో.. తెలియదు కానీ.. ఎవరికీ చెప్పకుండా.. అదేమంత పెద్ద విషయం కాదన్నట్లుగా నియామకం జరిపేశారు.
అయితే ఈ విషయంలో టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎందుకు ఊరుకుంటారు. తనకు తెలియకుండా నియామకం చేయడం ఏమిటని ఆయన ఫైరయిపోయారు. నేరుగా సీఎంవో అధికారులతో ఫోన్ చేయించి… శ్రీనివాస్ గుప్తాకు చీవాట్లు పెట్టించారు. వెబ్ సైట్ నుంచి వివరాలు తీసేశారు. అంతే కాదు.. శ్రీనివాస్ గౌడ్ ఇంకా దారుణంగా హారిక గురించి మాట్లాడారు. దేత్తడి హారిక ఎవరో తనకు తెలియదని ప్రకటించేశారు. దీంతో హారిక మరింత నొచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నియామక పత్రం ఇచ్చి… వివాదం చేయడం మాత్రమే కాకుండా.. . తనను కించ పరిచేలా మాట్లాడుతూండటంతో ఆమె హర్ట్ అయ్యారు. అయితే పొలైట్‌గానే పదవికి గుడ్ బై చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ – గుప్తాల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటిది కాదని చాలా కాలంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది.
హోదాలో పై స్థాయిలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ను లెక్క చేయకుండా… శ్రీనివాస్ గుప్తా నిర్ణయాలు తీసుకుంటారని అది గౌడ్‌కు నచ్చదన్న ప్రచారం ఉంది. వీరి ఆధిపత్య పోరాటంలో హారిక బలైపోయింది. ఇప్పుడు ఈ వివాదం పూర్తిగా పక్కకు తొలగి.. తాను వెబ్ సిరీస్‌ల మీద దృష్టి పెడతానని హారిక చెబుతున్నారు. మొత్తానికి తనకు సంబంధం లేకుండానే రాజకీయ వివాదంలో చిక్కుకున్న హారిక మానసిక ఒత్తిడికి గురయ్యారు.