మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస మరోసారి విజయ ఢంకా మోగిస్తోంది. ఏ ఎన్నికలు వచ్చినా తమకు తిరుగులేదని మరోసారి ఆ పార్టీ తాజా విజయంతో చాటి చెబుతోంది. అన్ని జిల్లాల్లోనూ తెరాస ఏకపక్షంగా ఆధిక్యం సాధించింది. కొన్ని చోట్ల మొత్తం వార్డులను క్లీన్ స్వీప్ చేసిన ఫలితాలు కూడా ఉన్నాయి. ఇతర పార్టీలు బలమైన పోటీ ఇచ్చిన పరిస్థితే ఈ ఫలితాల్లో కనిపించలేదు. తెరాసకు తామే ప్రత్యామ్నాయమంటూ పోటీకి దిగిన భాజపా, తమ సత్తా చాటుకుంటామనీ, రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనీ పురపోరుకి దిగిన కాంగ్రెస్ పార్టీలు ఉనికిని చాటుకోవడంలో మరోసారి విఫలమయ్యాయి. నారాయణఖేడ్, వడ్డేపల్లి, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆమనగల్ లో భాజపా విజయం సాధించాయి. భైంసాలో ఎమ్.ఐ.ఎమ్.కి భాజపా గట్టిపోటీనే ఇచ్చినా… చివరికి ఎమ్.ఐ.ఎమ్. విజయం సాధించింది.
తెరాసకు మొదట్నుంచీ సమస్యగా మారతారేమో అనుకున్న రెబెల్స్ కూడా కొన్ని చోట్ల ఉనికి చాటుకున్నారు. సిరిసిల్లలో తెరాస విజయం సాధించింది. అయితే, ఇక్కడ పది వార్డుల్లో రెబెల్స్ గెలిచారు. కొల్లాపూర్లో రెబెల్స్ ని మాజీ మంత్రి, తెరాస నేత జూపల్లి రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. పార్టీ అధినాయకత్వం నుంచి హెచ్చరికలు వచ్చినా ఆయన తన వర్గాన్ని ఎన్నికల బరి నుంచి తప్పించే ప్రయత్నమే చెయ్యలేదు. అంతిమంగా, తాజా ఫలితాల్లో జూపల్లి వర్గం సత్తా చాటుకుంది. దీంతో గెలిచిన తన వర్గ అభ్యర్థుల్ని క్యాంపునకు జూపల్లి తరలిస్తున్నట్టు సమాచారం.
మున్సిపల్ ఫలితాల్లో విజయంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ నాయకత్వానికి తిరుగులేదన్నారు. తమకు మరోసారి ఇంతటి విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి ఇంతవరకూ ఏ ఎన్నిక జరిగినా ప్రజలు తమని ఆదరిస్తున్నారనీ, అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లా పరిషత్, పంచాయతీలు… ఏ ఎన్నికలు వచ్చినా ఘన విజయం సాధిస్తున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందనీ, ఈ ఎన్నికల్లో వందకు పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెరాస నాయకత్వంతోపాటు, పార్టీ కోసం గడచిన నెలన్నరగా కష్టపడ్డ పార్టీ శ్రేణులకీ కార్యకర్తలకీ ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించిన ఎమ్మెల్యేలు, మంత్రులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలియజేశారు.