ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగింపునకు వచ్చింది. ప్రధానమంత్రిని కలిశారుగానీ, మాయావతీ అఖిలేష్ యాదవ్ లను కలవలేదు. జాతీయ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటులో భాగంగా కలవాలని భావించారు. అఖిలేష్ యాదవ్ స్వయంగా తెలంగాణ వచ్చి, కేసీఆర్ ను కలుస్తా అంటూ స్పష్టం చేశారు. మాయావతితో భేటీపై గురువారం రాత్రి వరకూ స్పష్టమైన సమాచారం అందలేదు. అయితే, ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఆయన మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ ఓటర్ల జాబితాలపై చాలా అభ్యంతరాలు వ్యక్తమౌతూ వచ్చాయి. చాలామంది పేర్లను తలొగించాలంటూ వాదనలు వినిపించాయి. చివరికి ఎన్నికల తరువాత ఈసీ కూడా ఈ విషయమై ప్రజలకు క్షమాపణలు చెప్పింది. త్వరలో రాబోతున్న లోక్ సభ ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలోని అవకతవకల్ని సరిచేయాలంటూ సునీల్ అరోరాను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఓట్ల తొలగింపు వల్ల తెరాస బాగా నష్టపోయిందనే అభిప్రాయం కేసీఆర్ వ్యక్తం చేయడం విశేషం. తమ పార్టీ తెరాస గుర్తు కారు ఉంటే… దాదాపు దాన్ని పోలినట్టుగా ఉన్న ఇతర వాహనాలను కొంతమందికి కేటాయించడం ద్వారా, ప్రజలు గందరగోళానికి గురయ్యారని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు సమాచారం. కాబట్టి, కారును పోలి ఉన్న ఇతర గుర్తుల్ని తొలగించాలంటూ ఎన్నికల కమిషనర్ ను కోరారు. ఓటరు జాబితాపై వెంటనే రివ్యూ చేసి, తొలగించిన ఓట్ల విషయమై చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ కూడా ఓటర్ల జాబితా వల్లనే నష్టపోయామంటూ వాదన వినిపించడం విశేషం! ఇక, భాజపా కూడా ఇదే వాదనను ఎన్నికల కమిషన్ ముందు వినిపించింది. తెలంగాణలో పెద్ద మొత్తంలో అర్హుల ఓట్లను తొలగించడం వల్ల తమ పార్టీ నష్టపోయిందంటూ ఈ ప్రాంత నేతలు కూడా ఈసీని కలవడం మరో విశేషం. ఇక, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల జాబితాలో అవకతవకలు అంటూ ఎన్నికల ముందు నుంచీ ఏకంగా న్యాయ పోరాటమే చేసింది. జాబితా సవరించే వరకూ ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ పోరాడింది. తెలంగాణలో ప్రముఖ పార్టీలన్నీ ఓటర్ల జాబితాలోని అవకతవకల వల్లనే నష్టపోయామంటూ మాట్లాడుతూ ఉండటం విచిత్రం…!