ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అనూహ్యమైన పొత్తులతో రాజకీయ పోరాటం చేస్తున్నాయి. బీజేపీ – జనసేన పొత్తులు పెట్టుకుని రంగంలోకి దిగగా… ఎప్పుడూ లేని విధంగా టీఆర్ఎస్ కూడా… సీపీఐతో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీకి మూడు స్థానాలు కేటాయిస్తున్నట్లుగా మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటించారు. నిజానికి టీఆర్ఎస్ నేరుగా పొత్తులు పెట్టుకోవడానికి విముఖం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. ఏదైనా రాజకీయంగా లోపాయికారీ రాజకీయాలు చేయడం వరకూ చేస్తున్నారు. తొలి సారిగా కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను పొత్తు ప్లాన్లోకి దింపారు.
పువ్వాడ అజయ్ .. ఖమ్మంలో సీపీఐతో పొత్తు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఆయన సీపీఐ నుంచే ఎదిగారు. ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు ఖమ్మం రాజకీయాల్లో లెజెండ్ లాంటి మనిషి. తండ్రి అడుగుజాడల్లో నడిస్తే రాజకీయంగా పెద్దగా భవిష్యత్ ఉండదనుకున్న అజయ్.. మొదట కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. ఖమ్మంలో … కమ్యూనిస్టులకు ఇప్పటికీ క్యాడర్ ఉంది. వారి ఓట్లు ప్రభావ శీలం కావడంతో… పాటు సీపీఐకి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా ఉంటుందన్న ఉద్దేశంతో మూడు కార్పొరేటర్ సీట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది.
మంత్రిగా ఖమ్మం బాధ్యత మొత్తం తనపైనే ఉండటంతో.. అజయ్.. ఒంటరిపోరాటం చేస్తున్నారు. ఇతర సీనియర్లు ఎవరూ ఎన్నికల్లో పట్టించుకోవడంలేదు. ఫలితంగా.. తన మనుషులు అన్నవారికే అత్యధికంగా టిక్కెట్లు ఇచ్చారు. పొత్తులు కూడా రెడీ చేశారు. ఫలితాలను చూపించాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే పడింది.