జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో అధికార తెరాస పూర్తి మెజార్టీ సాధించి, మజ్లీస్ సహాయం, ఎక్స్ అఫీషియోల సహాయం లేకుండానే గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. ఫలితాలు పూర్తిగా ఏకపక్షంగా తెరాసకి అనుకూలంగా వచ్చేయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలలో తెరాస-71, తెదేపా+బీజేపీ-5, కాంగ్రెస్-1, మజ్లీస్-16, ఇతరులు-1 స్థానాలలో విజయం సాధించారు. తెరాస-28, తెదేపా+బీజేపీ-5, కాంగ్రెస్-1, మజ్లీస్-18, ఇతరులు-1 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.
అంటే తెరాస మొత్తం: 99 స్థానాలను ఖచ్చితంగా గెలుచుకోబోతోందని స్పష్టం అవుతోంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆ సంఖ్య మరికొంత పెరిగి 100 దాటినా ఆశ్చర్యం లేదు. ఇక తెరాస తరువాత మజ్లీస్ పార్టీ ఎక్కువ స్థానాలు సంపాదించుకోగలిగింది. ఆ పార్టీ మొత్తం 34 స్థానాలలో గెలుచుకొనే దిశలో ముందుకు సాగుతోంది. తెదేపా-బీజేపీ కూటమికి ఈ ఎన్నికలలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవి రెండూ కలిపి 10 స్థానాలు గెలుచుకొనే అవకాశం కనబడుతోంది. వారి కూటమి కనీసం 30-40 స్థానాలు అయినా గెలుచుకొంటుందని అందరూ ఆశించారు. కానీ మరీ ఇంత ఘోరంగా ఓడిపోతాయని ఎవరూ ఊహించలేదు.
వామపక్షాలతో కలిసి పోటీ చేసిన లోక్ సత్తా పార్టీ ఎక్కడా కనబడలేదు. అలాగే స్వతంత్ర అభ్యర్ధులని కూడా ప్రజలు ఈసారి అస్సలు పట్టించుకోలేదు. తెలంగాణా ముఖ్యమంత్రి వరంగల్ ఉపఎన్నికల తరువాత గ్రేటర్ ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 80 సీట్లు గెలుచుకొంటుందని జోస్యం చెప్పారు. ఆయన చెప్పినదాని కంటే కూడా ఎక్కువ సీట్లు గెలుచుకోవడం విశేషం.