తెలంగాణ ప్రజల అభిమానాన్ని పొందడానికి.. తెలంగాణ రాష్ట్ర సమితి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ప్రజలకు వ్యతిరేకంగా లబ్ది చేకూర్చే పధకాలను నాలుగున్నరేళ్లలో పదుల సంఖ్యలో ప్రవేశ పెట్టారు. బీసీలకు గొర్రెల పంపిణీ దగ్గర్నుంచి… రైతులకు పెట్టుబడి సాయం వరకూ.. ఇలాంటివి చాలా ఉన్నాయి. టీఆర్ఎస్ను మించేలా.. కాంగ్రెస్ పార్టీ.. మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రకటించింది. అందులో రుణమాఫీ నుంచి ఉచితంగా ఆరు సిలిండర్ల వరకూ చాలా అంశాలున్నాయి. ఎలా లేదన్న కొన్ని వర్గాలు ఈ హామీలకు ఆకర్షితులవుతాయి. అందుకే టీఆర్ఎస్పై ఒత్తిడి పెరిగింది. కేకే నేతృత్వంలోని టీఆర్ఎస్ మ్యానిఫెస్టో కమిటీలో… ప్రధానంగా రుణమాఫీ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా.. తాము అధికారంలోకి రాగానే ఒకే సారి రూ. 2లక్షలు రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. చాలా రోజులుగా.. ఈ హామీని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీని ప్రభావం గట్టిగానే ఉంటుందని… భావించిన కేసీఆర్… తమకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షుణ్ణంగా తెలుసని.. ఆ హామీ అమలు అసాధ్యమని చెబుతూ వచ్చారు. అంత పెద్ద బడ్జెట్ ఉన్న కర్ణాటకలోనే… రైతులకు విడతల వారీగా రుణమాఫీ చేశారని.. తెలంగాణలో ఎలా చేస్తారన్న ప్రశ్న లేవనెత్తారు. ఇవన్నీ రాజకీయాల్లో విమర్శించుకోవడానికి బాగానే ఉంటాయి కానీ.. రైతుల్లోకి వెళ్లిందంటే మాత్రం గుంపగుత్తగా ఓట్లు కాంగ్రెస్కు పడిపోతాయి. అందుకే టీఆర్ఎస్ ఇప్పుడు పెట్టుబడి నిధికి తోడు.. రుణమాఫీ కూడా ప్రకటించే ఆలోచన చేస్తోందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం ప్రారంభమయింది. కాంగ్రెస్ చెప్పినట్లు రూ. 2 లక్షలు కాకపోయినా.. కనీసం రూ.లక్ష వరకైనా ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మ్యానిఫెస్టో కమిటీ తొలి భేటీలో చర్చకు వచ్చింది.
15 రోజుల్లో మేనిఫెస్టో రూపకల్పన పూర్తి చేస్తామని కేకే ప్రకటించారు. వివిధ వర్గాల నుంచి వినతి పత్రాలు అందాయని.. ప్రధానంగా 20 అంశాలపై చర్చించామంటున్నారు. మేనిఫెస్టో ముసాయిదాను ఈసీకి సమర్పిస్తామనిప్రకటించారు. మంచి మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచుతామన్నారు. ఇతర పార్టీలు మేనిఫెస్టోలో ఏం పెట్టాయనేది తమకు సంబంధం లేదని కేసీఆర్ స్పష్టం చేసారు. బహుశా.. ఏ ఏ పథకాలు.. హామీలు ఇవ్వాలన్నదానిపైనా కేసీఆర్ ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చి ఉంటారని.. ఫార్మాలిటీ కోసమే… మ్యానిఫెస్టో కమిటీ అన్న చర్చ కూడా టీఆర్ఎస్లో నడుస్తోంది.. అది వేరే విషయం.