ఊహించినట్లుగానే నారాయణఖేడ్ ఉప ఎన్నికలలో కూడా తెరాస 53, 624 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో దాని ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. అదే సమయంలో ప్రతిపక్షాల ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బ తింటుంది. ఇక ముందు జరుగబోయే ఏ ఎన్నికలలో కూడా తెరాసను ఓడించలేమనే అభిప్రాయం ప్రతిపక్షాలకి కలిగితే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ ఫలితాలు తెలంగాణా ప్రజలపై కూడా చాలా ప్రభావం చూపవచ్చును.
ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి-39, 451 ఓట్లు, తెదేపాకి-14, 748 ఓట్లు వచ్చినా చివరికి తెరాసయే మళ్ళీ గెలిచింది కనుక తెరాసకు తప్ప మరే పార్టీకి ఓటేసిన అవి మురిగిపోతాయనే అభిప్రాయం ప్రజలకు కలుగవచ్చును. ఆ కారణంగా త్వరలో జరుగనున్న వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికలలో తెరాసకు లబ్ది కలుగవచ్చును. గ్రేటర్ ఎన్నికల తరువాత తెరాసలోకి తెదేపా ఎమ్మెల్యేల వలసలు మొదలయ్యాయి. ఈ ఉపఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి కూడా తెరాసలోకి వలసలు మొదలవ వచ్చును. అందరికంటే ముందుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సంజీవ రెడ్డి తెరాసలోకి వెళ్లిపోతారేమో! ఎందుకంటే ఆయన ఈ ఉపఎన్నికలు జరుగక ముందే తెరాసలోకి వెళ్ళిపోయి తెరాస తరపున పోటీ చేయాలనుకొన్నారు. కానీ ఆఖరినిమిషంలో మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయే ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. అదే…ఆయన ఈ ఉపఎన్నికలలో తెరాస తరపున పోటీ చేసి ఉండి ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవారు. కానీ అప్పుడు ఈ అవకాశాన్ని కాలదన్నుకొన్నారు కనుక ఇప్పుడు చేయగలిగిందేమీ ఉండదు…తెరాసలో చేరడం తప్ప.
ఒకవేళ ఈ ఉపఎన్నికల తరువాత ఆయనతో సహా ప్రతిపక్షాల నేతలు తెరాసలోకి వలసలు వెళ్లిపోవడం మొదలుపెడితే, అది కూడా ప్రతిపక్షాల గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. తెరాసకు తప్ప మరే పార్టీకి ఓటేసినా మళ్ళీ ఏదో ఒకరోజు వాళ్ళు కూడా తెరాసలోనే చేరిపోవచ్చును కనుక ఆ వేసే ఓట్లేవో తెరాసకే వేస్తే సరిపోతుందనే అభిప్రాయం ప్రజలకు కలుగవచ్చును. ఆవిధంగా కూడా తెరాసకు ప్రయోజనం కలుగుతుంది.
వరంగల్, ఖమ్మం ఎన్నికలలో ఇవే ఫలితాలు పునరావృతమయితే, ఇక ఇప్పట్లో తెలంగాణాలో ప్రతిపక్షాలు కోలుకొనే పరిస్థితులు ఉండకపోవచ్చును. ఒకవేళ అవి కోలుకొనే ప్రయత్నాలు చేసినా తెరాస చేతులు ముడుచుకొని కూర్చొని చూస్తూ ఊరుకోదు కనుక ప్రతిపక్షాలని పూర్తిగా నిర్వీర్యం చేయడం తధ్యం. అన్నిటికంటే ముందుగా తెలంగాణా రాష్ట్రంలో నుండి తెదేపాను కనబడకుండా చేయడానికే అది గట్టిగా ప్రయత్నించవచ్చును.
ఆ ప్రయత్నంలో అది సఫలం అయితే రాష్ట్రంలో బీజేపీ కూడా బలహీనపడుతుంది. ఒకవేళ బీజేపీ అంగీకరిస్తే దానితో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీని కూడా రాష్ట్రం నుంచి తుడిచిపెట్టేసి ఇక రాష్ట్రంలో తనకు ఎదురులేకుండా చేసుకోవచ్చును. కనుక వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చును.