తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వ్యూహాలు చాలా చిత్రంగా.. ఉంటాయి. అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నామని నమ్మకం కలిగించేస్తారు. చివరికి ఏమీ ఇవ్వరు. అది ప్రభుత్వం అయినా.. చివరికి రాజకీయం అయినా అలాగే ఉంటాయి. పంచాయతీ ఎన్నికలు పెట్టేస్తున్నానని హడావుడి చేశారు.. కానీ కోర్టుకెళ్తే ఆగిపోయేలా.. నిబంధనలు అందులో ఉంచుతారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తారు. ఏదో ఒక తేడాతో.. ఆగిపోయేలా చేస్తారు. ఇలా నాలుగున్నరేళ్ల కాలంలో.. కేసీఆర్ ప్రజలకు ఎన్నో చేద్దామనుకున్నారు కానీ.. ఏమీ చేయలేకపోయారు. కానీ ప్రజల్లో మాత్రం.. ఏదో చేద్దామనుకున్నారన్న సంతృప్తిని మాత్రం ఇప్పటికి మిగిల్చారు. అదే ధైర్యంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు పార్టీ విషయంలోనూ అదే ప్లాన్ అమలు చేస్తున్నారు. సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఇచ్చేశారు. ఇప్పుడు… తీరిగ్గా.. ఎరెవరికి ఎగ్గొట్టాలా అన్న అంశంపై తీవ్రంగా కసరత్తు చేసి.. దానికి తగ్గట్లుగా.. పరిణామాలు జరిగేలా స్కెచ్‌లు వేస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో.. ప్రజలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కనీసం 30 నుంచి 40 మంది సిట్టింగులు ఏ పార్టీ తరపున పోటీ చేసినా.. మళ్లీ గెలవడం అసాధ్యం. ఆ విషయం కేసీఆర్‌కు తెలియక కాదు. కానీ.. వారందరికీ టిక్కెట్లు ఒకే సారి నిరాకరిస్తే.. వాళ్లందరూ కలిసి పార్టీని పాతాళానికి తొక్కేస్తారు. అందుకే ముందుగా టిక్కెట్లు ప్రకటించారు. మధ్యలో చాలా సమయం ఉంది కాబట్టి… టిక్కెట్లు ఎగ్గొట్టాలనుకున్న వారికి వ్యతిరేకంగా.. ప్రదర్శనలు.. కేసులు.. వివాదాలను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఫాం ఇచ్చే నేతలు వేరే ఉంటారని జోరుగా టీఆర్ఎస్ హైకమాండ్ నుంచే ..సంకేతాలు వస్తూండటంతో… టిక్కెట్ల కోసం ఆశలు పెట్టుకున్న వారు బలప్రదర్శనలు ప్రారంభించారు.
గులాబీ పెద్దల ఆశీస్సులతోనే పలువురు నేతలు బలప్రదర్శనలు చేస్తున్నారనే గుసగుసలు టీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి. ఇటీవల పరిణామాలు చూస్తే అది నిజమేనన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ ను తాటికొండ రాజయ్యకే ఇచ్చారు. ఇటీవల రాజయ్య మీద వస్తోన్న ఆరోపణలతో ఆయనకు బిఫామ్ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. వెంటనే కడియం వర్గీయులు.. రోజూ.. రాజయ్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇక మేయర్ బొంతు రామ్మోహన్ కు మద్దతుగా కార్పొరేటర్లు రంగంలోకి దిగారు. కుత్భుల్లాపూర్‌లో.. కేటీఆర్ అనుచరుడు.. శంభీపూర్ రాజు.. బీఫాం తనకే వస్తుందంటూ… పార్టీని మొత్తం గుప్పిట్లో పెట్టేసుకున్నారు. రమేష్ రాథోడ్ … భారీ ర్యాలీ నిర్వహించి ధిక్కారం వినిపించారు. కానీ ఇప్పుడు ఆయనకు టిక్కెట్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వీళ్లందరూ.. హైకమాండ్ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారు. ఇవి చూపించి బీఫాలంను కేసీఆర్ ఎగ్గొట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.