మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (డి.ఎస్.)ని రాజ్యసభకి పంపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించినట్లు తాజా సమాచారం. కేసీఆర్ తన కుమార్తె కవిత సిఫార్సు మేరకు ఆయన పేరు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
తెరాసకున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం ఇద్దరిని రాజ్యసభకి పంపగలదు. ఆ రెండు స్థానాల కోసం తెరాసలో చాలా మంది పోటీ పడుతున్నారు. వారిలో డి.ఎస్. కూడా ఒకరు. ఆయన తెరాసలో చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకి ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తనకు రాజ్యసభ సీటు తప్ప మరేది అవసరం లేదని డి.ఎస్. తేల్చి చెప్పారని, చివరికి కేసీఆర్ అందుకు సరేనన్న తరువాతనే డి.ఎస్. తెరాసలో చేరినట్లు వార్తలు వచ్చేయి. అయితే తను పదవులకు ఆశపడి తెరాసలో చేరడం లేదంటూ అప్పుడు డి.ఎస్. చెప్పారు. పదవులకు ఆశపడని రాజకీయ నేతలెవరూ మన దేశంలో లేరు కనుక డి.ఎస్. చెప్పిన మాటని ఎవరూ నమ్మలేదు.
ఆయన పార్టీలో చేరగానే ‘ప్రభుత్వానికి ప్రత్యక సలహాదారు’ పదవి ఒకటి సృష్టించి డి.ఎస్.కి కట్టబెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎవరి సలహా అవసరం లేదని అందరికీ తెలుసు. కనుక డి.ఎస్.కి రాజ్యసభ సీటు కేటాయించేవరకు తాత్కాలిక ఏర్పాటే అని అందరికీ అర్ధమయింది. ఆయనకు హామీ ఇచ్చినట్లుగానే రాజ్యసభ ఎన్నికలు రాగానే ఆయన పేరు ఖరారు చేసినట్లున్నారు. కానీ మద్యలో కవిత సిఫార్సు వలననే ఆయనకి సీటు ఖరారు చేసినట్లు ఎందుకు పేర్కొన్నారో తెలియవలసి ఉంది. బహుశః ఆమె సిఫార్సు చేసారంటే ఎవరూ అడ్డు చెప్పరనేమో?