ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా విపక్షాల తరపున బరిలోకి నిలబడిన యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఆయన నామినేషన్లో కేటీఆర్ తన ఎంపీలతో కలిసి పాల్గొననున్నారు. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం చూస్తే యశ్వంత్ సిన్హాకు గెలుపు అవకాశాలు లేవు. కానీ పోటీ మాత్రం అనివార్యం. బీజేపీ తరపున ఎంత మంది వ్యతిరేకంగా నిలబడుతున్నారనేది కీలకం. టీఆర్ఎస్ ఈ విషయంలో గట్టిగా నిలబడాలని నిర్ణయించుకుంది. ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన సమావేశాలకు హాజరు కాకపోయినా యశ్వంత్ సిన్హా నామినేషన్‌కు మాత్రం హాజరవుతున్నారు.
బీజేపీలో గట్టిగా తలపడాలన్న ఆలోచనతో ఉన్న టీఆర్ఎస్.. ఇప్పటికి బీఆర్ఎస్ ఆలోచన చేస్తోంది. ఏ క్షణమైనా ప్రకటించవచ్చని చెబుతున్నారు కానీ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతోంది. రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ ప్రకటన చేస్తే సీరియస్ నెస్ ఉండదని భావిస్తున్న కేసీఆర్.. మొత్తం ప్రక్రియ అయ్యే వరకూ వేచిచూడాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మంచి రోజులు ఉండవు. అందుకే.. జూలైలో ఎలాంటి ప్రకటన బీఆర్ఎస్పై ఉండదని.. ఆగస్టులో ఉండవచ్చని చెబుతున్నారు.
అయితే బీజేపీని ఎదుర్కోవాలంటే.. పార్టీలు.. కూటములు సాధ్యం కాదని.. అందరూ ఏకతాటిపైకి రావాలనే చర్చ ఉంది. రాష్ట్రాల వారీగా ఇలా అందరూ బీజేపీని టార్గెట్ చేసుకుని పోరాడితే ఫలితం పొందవచ్చని లేకపోతే… విపక్షాల అనైక్యత వల్లే మోదీ గెలుస్తారని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ద్వారా విపక్షాలు ఏకం అయితే.. ఆ ఐక్యత ముందు ముందు సాగితే… దేశ రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయని భావిస్తున్నారు. అయితే అదంత తేలిక కాదని చెప్పుకోవచ్చు.