మజ్లిస్ తమకి ఫ్రెండ్లీ పార్టీ అని కొన్నాళ్ల కిందట అసెంబ్లీలోనే ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే, అధికారికంగా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లకు సంబంధించి ఎలాంటి చర్చలు జరిగినట్టు ప్రకటనలు లేకపోయినా… ఫ్రెండ్లీగా కలిసిమెలిసి మున్సిపల్ ఎన్నికల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నారు. ఒక్కసారి నామినేషన్ల ఉప సంహరణ లెక్కలు తీస్తే… ఈ రెండు పార్టీల మధ్యా ఎంతటి రాజకీయ అవగాహన ఉందనేది స్పష్టమౌతుంది.
తెలంగాణ వ్యాప్తంగా 47 పట్టణాల్లో ఎమ్.ఐ.ఎమ్. పోటీకి దిగింది. 441 వార్డుల్లో తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది. అయితే, ఉపసంహరణ తేదీ ముగిసేసరికి కేవలం 276 వార్డుల్లో మాత్రమే మజ్లిస్ అభ్యర్థులు మిగిలారు. అంటే, 135 చోట్ల తమ అభ్యర్థులతో నామినేషన్లను మజ్లిస్ వెనక్కి తీయించేసింది. మరీ అంతమందిని ఎందుకు వెనక్కి తగ్గించినట్టు..? తెరాస కూడా ఇలానే.. భైంసాలో ముగ్గురు అభ్యర్థుల్ని రంగంలోకి దింపినట్టే దింపి, తరువాత వారితో నామినేషన్లను తీయించేసి, మజ్లిస్ కి ఏకగ్రీవం అయ్యేలా చేసింది. తెరాస, మజ్లిస్ పోటీ పడుతున్న మరికొన్ని స్థానాల్లో కూడా అధికార పార్టీ డమ్మీ అభ్యర్థులనే పెట్టిందనీ, ఎన్నికల్లో ఒకరికి ఒకరు సాయం చేసుకునే ఏర్పాటు దిశగానే చాలా చోట్ల చర్చలు జరుగుతున్నాయనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.
రాష్ట్రంలో 6 మున్సిపల్ ఛైర్ పర్సన్ల సీట్లను దక్కించుకోవాలని మజ్లిస్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని సమాచారం. అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగిపోయాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. భైంసా, జల్ పల్లి, బోధన్, తాండూరు, ఆదిలాబాద్ ఛైర్ పర్సన్ పదవులు తమకే ఇవ్వాలని తెరాసను అసదుద్దీన్ కోరినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశమై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మొత్తానికి, ఈ రెండు పార్టీలూ అప్రకటితంగా సీట్ల సర్దుబాట్లు చేసుకుంటున్నాయనే వాతావరణం కనిపిస్తోంది.