తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కుల దురహంకార హత్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు టీఆర్ఎస్ నేత హరీష్ రావు. నిజానికి కొన్ని మీడియా లో పరువు హత్య అంటూ ప్రస్తావిస్తున్నారు కానీ, అసలు ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడ పరువు అనేది కనిపించదు కాబట్టి వీటిని పరువు హత్యలు అనడం కంటే కుల దురహంకార హత్యలు అని ప్రస్తావించడమే సమంజసం.
ట్విట్టర్ వేదికగా హరీష్ రావు వీటిపై స్పందిస్తూ అనాగరిక చర్యగా ఈ హత్యలకు అభివర్ణించారు. హరీష్ రావు గారు ట్వీట్ చేస్తూ , “నాగరికతతో పాటు నడుద్దాం.. కుల విధ్వేషాలకు దూరంగా ఉందాం..కుల వివక్ష ఒక సామాజిక రుగ్మత. అదొక అనాగరిక పరంపర. నాగరిక సమాజాల్లో అలాంటి వివక్షకు తావులేదు. కులం పేరుతో జరిగే హింస మానవతకి మచ్చ. పెళ్లి ద్వారా రెండు కులాలు కలుస్తున్నాయంటే అదొక సామాజిక వేడుక కావాలి . అంతరాలను అంతం చేసే ఆ ముందడుగును స్వాగతించాలి. ఎదిగిన బిడ్డల స్వేచ్ఛని గౌరవించాలి. పంతాలు, పట్టింపులకు పోయి బిడ్డల ఉసురు తీయకండి. ప్రాణాలు తీయాడాన్ని మించిన పరువు తక్కువ పని మరొకటి లేదని గుర్తించండి”
రాజకీయ నాయకులు ట్విట్టర్ ద్వారా ఈ కుల దురహంకార హత్యలను ఖండించడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇక్కడితో ఆగకుండా ముద్దాయిలకు కఠినమైన శిక్ష పడేలా చేసినప్పుడే వారి ప్రకటనలోని చిత్తశుద్ధి వెల్లడవుతుంది.