వైసీపీ నేతల వీక్నెస్ను టీఆర్ఎస్ నేతలు బాగా పట్టుకున్నారు. తాము ఏమన్నా నోరు మెదపలేని పరిస్థితి వైసీపీకి ఉందని.. వారికి అర్థమైపోయింది. దాంతో వారు నేరుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారు. తాము మహానేత అని గొప్పగా చెప్పుకుంటూ పార్టీకి మూల పురుషుడిగా ప్రచారం చేసుకుంటున్న వైఎస్ఆర్పై .. టీఆర్ఎస్ నేతలు అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నా.. నోరు మెదపడం లేదు. వీరి వీక్నెస్ ను పట్టిన టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. మరింత దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి అని కొత్త బిరుదు ఇచ్చారు.
ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని.. మండిపడ్డారు. పీజేఆర్ మృతికి వైఎస్సార్ కారణమని కొత్తగా ఆరోపించారు. పార్టీలో తొక్కేస్తున్న సమయంలో.. ఓ కార్యక్రమంలో వేదికపైకి ఆహ్వానించనందుకు.. గుండెపోటు వచ్చి పీజేఆర్ చనిపోయారని శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. అంతే గాక వైఎస్ విగ్రహాలు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నాయని.. ఇష్టం వచ్చినట్లు విగ్రహాలు పెట్టుకున్నారని మండిపడ్డారు. మరి అంత వ్యతిరేకత ఉంటే.. జగన్తో ఎందుకు సత్సంబంధాలు పెట్టుకున్నారంటే శ్రీనివాస్ గౌడ్ విచిత్ర వాదన వినిపిస్తున్నారు.
తండ్రి తప్పు చేస్తే.. కొడుకు అలా ఉండడు అనుకున్నామని చెప్పుకొచ్చారు. వైఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు.. వైసీపీ నేతలు ఇస్తున్న కౌంటర్ పేలవంగా ఉంటోంది. చర్చించడానికి జగన్ సిద్ధమన్న మాటలను మంత్రులు అదే పనిగా చెబుతున్నారు. కానీ ఈ చర్చల ప్రక్రియ నుంచి తిట్ల దశకు వచ్చింది. తమ పార్టీ మూల పురుషుడ్ని టీఆర్ఎస్ నేతలు అనుచితంగా తిడుతున్నా.. గట్టిగా కౌంటర్ ఇవ్వలేని దుస్థితికి వైసీపీ చేరింది. ఈ పరిస్థితి వైసీపీ సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. ఎవరూ తెలంగాణ రాష్ట్ర సమితిపై నోరెత్తడం లేదు.