ధాన్యం సేకరణ అంశం కేంద్రం, తెలంగాణ మధ్య చిక్కుముడిగా పడిపోయింది. కేంద్రం ఎప్పుడూ చెప్పేదే చెబుతోంది.. తెలంగాణ కూడా ఒకటే వాదన వినిపిస్తోంది. ఇద్దరి వాదనల్లోనూ ఎవరికి వారు ఇతరులను తప్పు పడుతున్నారు. కానీ అసలు సమస్యలోనే స్పష్టత లేకుండా పోయింది. ధాన్యం సేకరణ అంశంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని టీఆర్ఎస్ సిద్ధమైంది. శని, ఆదివారం రెండు విడతలుగా ఢిల్లీ వెళ్లిన టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు అక్కడే ఉన్నారు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా వారికి.. మంగళవారమే పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ దొరికింది. పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు సుమారు 45 నిమిషాల పాటు సమావేశం అయ్యారు.
ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీకి మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని లిఖితపూర్వకంగానే ఇవ్వాలని మంత్రులు పట్టుబట్టారు. రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని పీయూష్ గోయల్ చెప్పారని .. స్పష్టమైన, లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చే వరకూ ఢిల్లీలోనే ఉండాలని మంత్రులు, ఎంపీలు నిర్ణయించుకున్నారు. కేంద్రం నుంచి స్పష్టత రాకుండా తము ఢిల్లీ నుంచి వెళ్లే ప్రశ్నే లేదనిచెబుతున్నారు. అయితే గోయల్ అన్నారో లేదో కానీ గోయల్ మాత్రం వారిని మీడియా ముందు ఈసడించుకున్నారు.
తెలంగాణ మంత్రులు, ఎంపీలతో భేటీ అయ్యే ముందే పీయూష్ గోయల్ వివాదంపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి వచ్చిన బీజేపీ నేతలతో సమావేశం అయితే.. టీఆర్ఎస్ తీరుపై విరుచుకుపడ్డారు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తూ.. తెలంగాణ ధాన్యం గోల తప్ప, మాకు మరో పని ఉండదా..? అని కేంద్రమంత్రి చిరాకుపడ్డారు. ఎందుకు ఢిల్లీలో ఉన్నారు అంటూ తెలంగాణ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు పని, పాటా లేదా? నేను మిమ్మల్ని రమ్మన్నానా? మీరు ఎప్పుడు వస్తే అప్పుడు నేను కలవాలా? అని గోయల్ విరుచుకు పడ్డారు. దీంతో రెండు రోజుల్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించడంతో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.