ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల స్నేహం కొనసాగుతుంటే మరోపక్క తెరాస యధాప్రకారం తెదేపా ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆకర్షిస్తూ తెలంగాణాలో తెదేపాను పూర్తిగా తుడిచిపెట్టేసే పనిలో చాలా బిజీగా ఉంది. ఇదేదో చంద్రబాబు నాయుడు తెలియకుండా రహస్యంగా జరుగుతున్న వ్యవహారం కాదు. తెలంగాణ ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామరావు మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కొందరు తెదేపా నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరిన సందర్భంగా నిన్న మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణాలో నుండి తెదేపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అది పరిమితం కాబోతుందని జోస్యం చెప్పారు.
వచ్చే నెలలో జరుగబోయే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెరాస పార్టీ హైదరాబాద్ లోని తెదేపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను తెరసలోకి రప్పించేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది. తెరాస మంత్రులు హరీష్ రావు, కె.తారక రామరావు, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నలుగురు తెదేపా ఎమ్మెల్యేలు వివేక్ (కుత్బుల్లాపూర్), గాంధీ (శేరిలింగంపల్లి) లను తెరాసలోకి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. వారిరువురిలో వివేక్ గౌడ్ తనకు తెరాసలో చేరే ఆలోచన, ఆసక్తి లేవని నిర్ద్వందంగా తేల్చి చెప్పగా, గాంధీ మాత్రం ఇంకా తెరాస నేతలతో మాట్లాడుతున్నట్లు సమాచారం. తెలంగాణాలో తెదేపాను పూర్తిగా తుడుచిపెట్టేసేందుకు తెరాస ఇంత బహిరంగంగా ప్రయత్నాలు చేస్తుంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏమాత్రం చింతిస్తున్నట్లు లేరు. పైగా తమ పార్టీని తుడిచిపెట్టేస్తున్న కేసీఆర్ తో స్నేహం కోసం పరితపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.