మీకు ఆరోగ్య సమస్యలేమీ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి..?. జిందాతిలిస్మాత్ వాడండి..! అనే ప్రకటన చాలా సార్లు చూసి ఉంటాం. ఇదే తరహాలో.. దేశంలో ప్రజలందరికీ ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి..? . ఏమీ చేయక్కర లేదు.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ను ప్రధానమంత్రిని చేస్తే చాలు. దేశంలో ఉన్న ప్రజల సమస్యలన్నీ మటుమాయం అయిపోతాయి. ఇలా చెప్పింది ఎక్కడో కాదు.. తెలంగాణ అసెంబ్లీలో.. చెప్పింది ఎవరో కాదు.. కేసీఆర్ కేబినెట్లోని మంత్రి మల్లారెడ్డి. అసలు దేశంలోని ప్రజల సమస్యలేమిటో… వాటికి పరిష్కారం.. కేసీఆర్ ప్రధాని కావడం అని మల్లారెడ్డి ఎందుకనుకున్నారో తోటి సభ్యులకు అర్థం కాలేదు కానీ.. పొగిడింది కేసీఆర్ను కాబట్టి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చప్పట్లు కొట్టారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనను కేసీఆర్ ఇప్పటికి విరమించుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో మల్లారెడ్డి .. మళ్లీ కేసీఆర్ ప్రధాని అనే వాదనను అసెంబ్లీలోనే తీసుకొచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల వరకూ హడావుడి చేశారు. ఆ సమయంలో… గ్రేటర్ ఎన్నికలు ముగియగానే బీజేపీయేతర పార్టీల సమావేశం ఉంటుందని.. తాను అందరితో మాట్లాడానని చెప్పారు. అయితే గ్రేటర్ ఎన్నికలు ముగియగానే ఆయన బీజేపీతో రణం లేదు.. రాజీ లేదు అనే ఫార్ములా అవలంభించారు.
దీంతో ఆయన వెనక్కి తగ్గిపోయారని అందరికీ క్లారిటీ వచ్చింది. కానీ మల్లారెడ్డి మాత్రం.. మళ్లీ కేసీఆర్ ప్రధాని అనే వాదనను అసెంబ్లీలోనే తీసుకు వచ్చారు. అయితే మల్లారెడ్డి వ్యాఖ్యలు సీరియస్గానా.. లేకపోతే.. ఆయన స్టైల్లోనే అనేసి ఉంటారా అన్న చర్చ జరుగుతోంది. ఎదుకంటే.. కేసీఆర్ను పొగడటంతో ఎవరి స్టైల్ వారిది. మల్లారెడ్డి స్టైల్ మల్లారెడ్డిదని .. సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. కొంత మంది టీఆర్ఎస్ నేతలే అనుకుంటూ ఉంటారు.