నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో.. పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడి పరువు హత్య కేసు మెల్లగా రాజకీయ రంగు పులుముకుంటోంది. హత్య కోసం.. చాలా పెద్ద స్కెచ్ వేశారని… దాని వెనుక.. టీఆర్ఎస్కు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే ఉన్నారన్న ప్రచారం..మిర్యాలగూడలో ఊపందుకుంది. ప్రణయ్ భార్య అమృతవర్షిణి జరిగిన ఘటనలన్నింటినీ.. వరుసగా చెబుతూంటే.. లింక్.. నేరుగా నకిరేకల్ పోతున్నట్లు తెలుస్తోంది. ప్రణయ్ – అమృత పెళ్లి చేసుకున్న తర్వాత.. వారిని విడదీసేందుకు.. చాలా ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా.. ప్రణయ్ తండ్రి బాలస్వామిపై చీటింగ్ కేసు కూటా పెట్టారు. ఆ సమయంలో.. సెటిల్మెంట్ కోసం… నకిరేకల్ సీఐ వద్దకు వెళ్లాలని… కేతేపల్లి అనే పోలీస్ స్టేషన్ సిబ్బంది.. తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. కానీ ఏదో జరుగుతోందన్న అన్న అనుమానంతో.. ప్రణయ్ – అమృత అప్పటి ఐజీ స్టీఫెన్ రవీంద్ర వద్దకు వెళ్లడంతో… వ్యవహారం సద్దుమణిగింది.
అయితే ఆ తర్వాత కూడా నకిరేకల్ నుంచి వ్యవహారాలు నడిచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమృత తండ్రి మారుతీరావు… గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరపేవారు. తర్వాత… టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలతోనే ఆయన ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో.. సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడుకోవడానికి… ఇటీవలి కాలంలో .. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ భర్త హత్య కేసులో ప్రముఖంగా పేరు వినిపించిన తాజా మాజీ ఎమ్మెల్యే సహకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుపారీ గ్యాంగులతో మర్డర్లు చేయించడంలో ఆ తాజా మాజీ ఎమ్మెల్యే రాటుదేలిపోయాడని సుదీర్ఘ కాలంగా ప్రచారం జరుగుతోంది.
అమృతవర్షిణి చెప్పే వివరాల ప్రకారం… వారికి తండ్రి వైపు నుంచి వచ్చిన బెదిరంపుల్లో.. సెటిల్మెంట్లలో ప్రధానంగా.. వివాదాస్పద టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే పేరే బయటకు వస్తోంది. దీంతో… ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకునే అవకాశం కనిపిస్తోంది. మిర్యాలగూడలోని ఆస్పత్రి ముందు.. ప్రణయ్‌ను హత్య చేసిన విధానం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఏ మాత్రం.. సంకోచం లేకుండా.. తోట్రు పాటు లేకుండా.. నేరం చేస్తున్నామనే భావన కానీ.. లేకుండా… ఓ కరుడుగట్టిన వ్యక్తి.. ఒక్క వేటుతో ప్రణయ్‌ను హంతకుడు చంపేశాడు. అంటే.. ప్రొఫెషనల్ కిల్లర్స్ పనేనన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఆ సుపారీ ముఠా ఎవరు..? ఆ ముఠాతో లింకులున్న వాళ్లెవరు అన్న వివాదాలు బయటకు వస్తే.. పరువు హత్య వెనుక రాజకీయ హస్తం బయటకు వచ్చే అవకాశం ఉంది.