టి.ఆర్.ఎస్. అంటే.. తిరుగులేని రాజకీయ శక్తి అనే స్థాయిలో తయారు చేద్దామని కేసీఆర్ అనుకున్నారు. అనుకున్నట్టుగానే తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయ శక్తుల పునరేకీరణ అంటూ ఫిరాయింపుల్ని విచ్చలవిడిగా ప్రోత్సహించారు. ఇలా తెరాస పంచన చేరిన ఇతర పార్టీల నేతలు కూడా కేసీఆర్ చెప్పుచేతల్లోకి వెళ్లిపోయారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చెబితే అదే అన్నట్టుగా ఇన్నాళ్లూ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండేది. అయితే, ఈ మధ్య కొంతమంది నేతల తీరు చూస్తుంటే… ఆ అంతర్గత ప్రజాస్వామ్యానికి బీటలు పడుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే సందర్భంలో పార్టీలోని అసంతృప్తులు బయటపడుతున్నట్టుగా ఉన్నాయి.
తాజాగా ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తెరాస నాయకులందరూ కాస్త గుర్రుగానే ఉన్నారని తెలుస్తోంది. ఇంతకీ ఆయన చేసింది ఏంటంటే… తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తులు బయటకి వచ్చాయి. నిజానికి, తీగల మొదట్లో టీడీపీలో ఉండేవారు. తరువాత గులాబీ గూటికి వచ్చేశారు. అప్పట్నుంచే గ్రూపు రాజకీయాలు రాజుకున్నాయి. సభ్యత్వ నమోదు సందర్భంగా గ్రూపుల మధ్య తగాదాలు మొదలయ్యాయి. అయితే, ఈ సందర్భంగా తీగెల మాట్లాడుతూ… తెరాసలో ఎవరైనా ఉద్యమకారులు అని చెప్పుకుంటే, వారిని తరిమి కొట్టండి అంటూ తన అనుచరులకు ఆదేశించారు. దీంతో అసలు గొడవ మొదలైంది.
అంతేకాదు, తెరాసలో కూడా కొంతమంది నాయకులు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. నిజానికి, తెలంగాణ ఉద్యమంలో ఈయన పాల్గొన్నదీ లేదు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతాన్నే ఈయనా ఫాలో అయ్యారు. ఇప్పుడేమో తెరాసలోకి వచ్చేసి ఇలా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ పంచాయితీ ఇప్పుడు కేసీఆర్ దగ్గరకి వెళ్లింది. మొన్నటికి మొన్న… మంత్రి పదవి తనకు దక్కడం లేదన్న దుగ్దతో శ్రీనివాస్ గౌడ్ కూడా ఇలానే పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా స్వరం వినిపించారు. తనకు మంత్రి పదవి ఇప్పించడంలో ఫెయిల్ అయ్యారంటూ ఎంపీ జితేందర్ పై బహిరంగంగానే మండిపడ్డారు.
మొత్తానికి, తెరాసలో ఉన్న అసంతృప్తులు ఒక్కోటిగా బయటపడుతున్నట్టుగానే భావించాలి. ఇన్నాళ్లూ కేసీఆర్ ఏది చెబితే అదే అన్నట్టుగా ఉంటూ వచ్చిన నేతలు.. లోలోపల ఉన్న ఆవేశాలను, ఆశయలనూ ఇలా బయటపెడుతున్నట్టుగా భావించాలి. ఓరకంగా ఇది ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్ గా మారే అవకాశాలున్నాయి. మరి, సొంత పార్టీ నేతలే ఇలా పరువు తీసేట్టుగా వ్యవహరిస్తుంటే కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.