తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు “పీడ దినాలు” వెంటాడుతున్నాయి. సంక్రాంతి తర్వాత మంచి దినాలు వస్తాయనుకుంటే.. అవి ఫిబ్రవరికి పొడిగింపు అయ్యాయి. డిసెంబర్ పదకొండో తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ముఖ్యమంత్రిగా రెండో సారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. మరో మంత్రిగా ప్రమాణం చేసిన మహబూద్ అలీ.. హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దాదాపుగా ఇరవై రోజులుగా.. ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి .. మరో మంత్రి ద్వారానే నడుస్తోంది. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తారనే.. ఆశతో.. మంత్రి పదవులపై ఆశలున్న నేతలు… తమ వంతుగా కేసీఆర్‌ను.. కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా దూకుడు చూపిస్తున్నారు.
తీరా ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రి పదవుల ఆశావహులకు.. కొత్తగా.. పీడదినాలు… పంచాయతీ ఎన్నికల రూపంలో వచ్చాయి. జనవరి ఒకటో తేదీనే.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. మూడు విడతలుగా.. పంచాయతీ ఎన్నికలు జరిగాయి. కచ్చితంగా జనవరి 30వ తేదీన ముగుస్తాయి. 90 శాతం పంచాయతీల్లో గులాబీ జెండా ఎగరాల్సిందేనని పట్టుదలగా ఉన్న టీఆర్ఎస్ అధినేత.. ఆ బాధ్యత అంతా ఎమ్మెల్యేల మీదే పెట్టారు. సహజంగానే.. ఈ ఎన్నికల్లో వారి పనితీరు మంత్రి పదవుల పంపకంలో ప్రామాణికం అవుతుంది. ఈ కారణంగానే… మంత్రి వర్గ విస్తరణ ఈ నెలలో జరిగే అవకాశం లేదని.. ప్రగతి భవన్ నుంచి మీడియా ప్రతినిధులకు..లీకులు వచ్చాయి.
నిజానికి కేసీఆర్.. ముందు నుంచీ.. పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయడం లేదని.. ఆరేడుగురు మంత్రులకు మాత్రమే చాన్సిస్తారని ప్రచారం జరుగుతోంది. మిగతా విస్తరణ పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు.. ఈ ఆరేడుగురికి కూడా.. ఫిబ్రవరి వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి. మంత్రులు ఉన్నా.. లేకపోయినా.. పాలనలో ఏ మాత్రం తేడా లేకపోవడంతో.. ప్రజలు కూడా.. మంత్రివర్గం ఉందా లేదా అన్న అంశంపై ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు… టీఆర్ఎస్లో వ్యక్తమవుతున్నాయి. అందుకే.. పీడ దినాలు.. ఇప్పటికే నెలాఖరు వరకు ఉంటాయి.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల వరకూ సాగుతాయా.. లేదా అన్నది అప్పటి పరిస్థితుల్ని బట్టి అంచనా వేసుకోవచ్చు.