మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బ్రదర్ అనిల్ కుమార్‌ను కలిశారంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ప్రచారం హోరెత్తింది. బ్రదర్ అనిల్‌తో కలిసి కూర్చున్న రాజయ్య ఫోటో విస్తృతంగా సర్క్యూలేట్ అయింది. దీంతో ఇక వైఎస్ఆర్ టీపీలో ఎమ్మెల్యే చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఆయన పార్టీ మారుతారని గతంలో ప్రచారం కూడా జరిగింది. ఈ కారణంతో ఆయన భేటీ సహజంగానే తెలంగాణ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.
అయితే ఈ ప్రచారంపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఉలిక్కిపడ్డారు. తాను లోటస్‌పాండ్‌కు పోలేదని.. బ్రదర్ అనిల్‌ను కలవ లేదని ప్రకటించారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటో పాతదని చెప్పుకొచ్చారు. పాత ఫోటోలతో తనపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. రాజయ్య రాజకీయ రంగ ప్రవేశం కాంగ్రెస్ పార్టీతోనే జరిగింది. అప్పట్లో వైఎస్ ఆయనను ప్రోత్సహించారు. తర్వాత టీఆర్ఎస్లో చేరారు. మొదట్లో ఆయనకు డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఇచ్చారు. అత్యంత ప్రాధాన్యమైన వైద్య ఆరోగ్యశాఖ కూడా ఇచ్చారు. కానీ ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న కారణంగా మధ్యలోనే రాజీనామా చేసే చాన్స్ కూడా ఇవ్వకుండా బర్తరఫ్ చేసేశారు. అయినా రాజయ్య.. పక్క చూపులు చూడకుండా టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు.
స్టేషన్ ఘన్పూర్ నుంచి మరో బలమైన నేత టీఆర్ఎస్లో ఉన్నారు. ఆయనే కడియం శ్రీహరి. గత ఎన్నికల్లో ఒకరిద్దరికి తప్ప సిట్టింగ్‌లందరికీ కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. ఈ కోటాలో రాజయ్యకు కూడా టిక్కెట్ వచ్చింది. దీంతో ఆయన గెలిచారు. కానీ ఎమ్మెల్సీగా కడియం పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయనకు ఏ పదవీ లేకుండా పోయింది. దీంతో ఆ నియోజకవర్గంలో ఆధిపత్య పోరాటం ప్రారంభమైంది. ఇటీవల కేసీఆర్ కడియంకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రాజయ్య అసంతృప్తికి గురవుతున్నారన్న ప్రచారం నేపధ్యంలో బ్రదర్ అనిల్‌తో భేటీ ఫోటో ఆయనకు మరింత ఇబ్బందికరంగా మారింది.