టిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ తన మీద సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పై వివరణ ఇచ్చారు. అందరు ఎమ్మెల్యేల మాదిరిగానే ఈయన కూడా, తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని అని తేల్చి చెప్పారు. వివరాల్లోకి వెళితే..
మిగతా పార్టీల నుండి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అలవాటు. 2014 లో మెజారిటీ తక్కువ వచ్చిన కారణంగా అలా చేస్తున్నాడేమో అని గత టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనుకున్న వాళ్లకు షాక్ ఇస్తూ భారీ మెజార్టీతో 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత సైతం ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించే తన సాంప్రదాయాన్ని కొనసాగించారు. అయితే, ఇటీవల మంత్రివర్గ విస్తరణ అనంతరం ఎమ్మెల్యే షకీల్ బిజెపి నేత మరియు ఎంపీ అయిన అరవింద్ ను కలవడం సంచలనం కలిగించింది. టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ముస్లిం ఎమ్మెల్యే అయిన తనకు మంత్రి పదవి వస్తుందని భావించినప్పటికీ కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అలిగిన కారణంగానే ఆయన బిజెపి నేతలకు టచ్ లోకి వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు మరీ విస్తృతంగా వ్యాపించడంతో ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. తాను టీఆర్ఎస్ వీడడం లేదని షకీల్ ప్రకటించారు. ఎంపీ అరవింద్ ను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని, ఎమ్మెల్యేగా గెలిచిన రెండుసార్లు కూడా కెసిఆర్ దయవల్లే తాను గెలిచానని, టిఆర్ఎస్ తన సొంత ఇల్లు వంటిదని, అనవసరంగా ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన అన్నారు.
మొత్తానికి ఎమ్మెల్యే షకీల్ ఈ విషయంలో ప్రస్తుతానికి క్లారిటీ వచ్చినట్లే. మరి ఎమ్మెల్యే షకీల్ ఇప్పుడు అన్న మాటలకు ఇలాగే కట్టుబడి ఉంటాడా లేక భవిష్యత్తులో షాక్ ఇస్తాడా అన్నది వేచి చూడాలి.