(ఆర్. సుభాష్ )
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ ఎంత ఆలస్యం చేస్తూంటే… తలసానికి అంతగా బీపీ పెరుగుతున్నట్లుగా ఉంది పరిస్థితి చూస్తూంటే. సంక్రాంతి కోడి పందేల కోసం ఏపీకి వచ్చి… కావాల్సినంత రాజకీయం చేశారు. దుర్గమ్మ గుళ్లో కూడా.. అనుచితమైన వ్యాఖ్యలు చేసి.. రాజకీయానికి తనకు గుడి, బడి తేడా లేదని నిరూపించేసి వెళ్లారు. అంతటితో ఆగలేదు.. ఏపీలో బీసీల్ని ఏకం చేస్తానంటూ.. కొత్తగా రాగం మొదలు పెట్టారు. ఇంతకీ ఏం చేస్తారంటే.. ఆంధ్రప్రదేశ్ఓట్లను 1% అయినా ప్రభావితం చేస్తానని చెప్పారు . నిజానికి తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్‌లో గెలవలేక… 2014లో చంద్రబాబు కాళ్లా, వేళ్లా పడి సనత్‌నగర్‌కు మారిన తలసాని. ఏపీలో ఓటర్లను ప్రభావితం చేయగలనని అనుకోవడం కామెడీనే..! ఒక్క శాతం అంటే కొన్ని సందర్భాల్లో దాదాపు ప్రభుత్వాలు పడిపోయే స్థాయి ,అయినా ప్రభావితం చేస్తానని చెప్పుకోవడం… అతిశయోక్తే..?
ఏపీలో ఒక్క శాతం ఓటర్లను ప్రభావితం చేసే స్థాయి తనకు ఉందని… అధినేత కేసీఆర్‌కు.. ఇలా ఓ సర్టిఫికెట్ పంపుకున్నారని అనుకోవచ్చు. నిజంగా తలసానికి ఏపీలో అంత సీనుందా..?.. తలసాని పేరు చివరన యాదవ్ అని ఉందని… ఏపీలోని యాదవులంతా.. పోలోమని ఆయన వెంట వెళ్లిపోతారా..? ఆయన మాటనే వేదవాక్కుగా భావిస్తారా..? ఏపీలో సమస్యలు వస్తే తలసాని వచ్చి తీరుస్తారా..? తెలంగాణ ప్రభుత్వ పథకాల్ని ఏపీ యాదవులకు అందిస్తారా..? అనే డౌటనుమానాలు చాలా వస్తాయి. ఏపీకి వచ్చినప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎదురొస్తే.. వాళ్లే తన బలం అయిపోతారా..? అంటే అలోచించాల్సిందే. అయినా… తలసాని మాటల్లోనే చాలా తేడా ఉంది. అదేమిటంటే.. ఒక్క శాతం అయినా… ప్రభావితం చేస్తానని చెప్పుకొచ్చిన వెంటనే… కేసీఆర్.. ఏపీకి రావడం వల్ల జగన్‌కేమీ నష్టం ఉండదని చెప్పుకొచ్చారు. అంటే… ఆ ప్రభావితం చేస్తున్న ఓట్లు.. జగన్ వైపు కాకుండా.. టీడీపీ వైపు పాజిటివ్‌గా ప్రభావితం చేస్తారేమోనన్న చర్చ జరుగుతోంది.
చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేస్తే దండయాత్రగా చెప్పుకొచ్చిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఏపీలో… అదే పని చేస్తే.. ఏపీ ప్రజలు ఎలా రియాక్టవుతారు..? ఆ మాత్రం అంచనా వేయలేనంత అమాయకులు కాదు… టీఆర్ఎస్ నేతలు. అయినప్పటికీ.. ఏపీ రాజకీయాల్లో దూకుడుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తలసాని వ్యవహారం… చంద్రబాబుకు, టీడీపీకి మేలు చేసేలా ఉందని.. ఇప్పటికే.. వైసీపీ నేతల్లో చర్చ ప్రారంభమయింది. ఆంధ్ర సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నంలో తలసాని ఉన్నారని అనుకుంటున్నారు. ఆయన మాటలు కూడా అలాగే ఉన్నాయి. తలసాని చెప్పిన ఒక్క శాతం.. తెలుగుదేశం పార్టీకి నెగెటివ్‌గా కాకుండా… ప్రజల్ని రెచ్చగొట్టి .. ఒక్క శాతం.. టీడీపీకి అనుకూలంగా మారుస్తానని చెబుతున్నట్లుగా ఉందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు.