టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం లోపు.. సభ్యత్వాల పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఒక్కో నియోజకవర్గంలో కనీసం యాభై వేల సభ్యత్వాలు కావాలని… పార్టీ నేతలకు టార్గెట్ పెట్టారు. సహజంగా ఈ బాధ్యత ఎమ్మెల్యేలు, ఇంచార్జ్లు మీదే పడుతుంది. ఇప్పుడు.. ఆ సభ్యత్వాలు చేయించడం.. వారికి తలకు మించిన భారంగా మారింది. సభ్యత్వ రుసుం కట్టడం మాత్రమే సమస్య కాదు… అందర్నీ ఎన్రోల్ చేయించడం కూడాసమస్యగా మారింది. ఎవరి పేర్లుపడితే వారి పేర్లురాసేసి.. సభ్యత్వ చందా తాము కట్టేస్తే పని పూర్తయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఓటర్ ఐడీతో సహా డేటా మొత్తం సేకరించాల్సి ఉంది. యాప్లో నమోదు చేయించాల్సి ఉంది.
అలా చేయించడానికి ఎమ్మెల్యేలు, ఇంచార్జ్లక పెద్దగా కార్యకర్తలు దొరకడంలేదు. ఉన్న వారందరికీ సభ్యత్వాలు చేయించినా.. పదివేలకు మించి కావడం లేదు. దాంతో ప్రభుత్వ పథకాలు పొందిన వారిని టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు పొందే వారందరూ టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవాల్సిందేనని.. లేకపోతే పథకాలు ఆగిపోతాయని బెదిరింపులకు దిగుతున్నారు. జనగామ ఎమ్మెల్యే, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అదే పనిలో ఉన్నారు. గ్రామాల్లో సభలు పెట్టి.. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న వారికే ఇక పథకాలు వస్తాయని బెదిరిస్తున్నారు. వీరి మాటల్ని కొంత మంది వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో అవి వైరల్ అయ్యాయి. ఇతర పార్టీల నేతలు బహిరంగంగా చెప్పకపోయినా అదే తరహా బెదిరింపులకు పాల్పడి సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు.అయినా అనుకున్నన్ని సాధ్యం కావడం లేదు. కనీసం యాభై లక్షల సభ్యత్వాలు చేయించాలని.. కేటీఆర్ కూడా.. టార్గెట్ పెట్టుకున్నారు.అయితే ఇతర అంశాలు హైలెట్ అవుతూండటంతో … సభ్యత్వాలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడ లేదు. కానీ పార్టీ ఆఫీసు నుంచి అదే పనిగా రిమైండర్లు వస్తూండటంతో.. ఇలా బెదిరింపులకు దిగడానికి వెనుకాడటం లేదు.