బీజేపీని ట్రాప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వారికి ప్రత్యేక భద్రత కల్పించిన తెలంగాణ సర్కార్.. బయటకు పోనివ్వడం లేదు. వారు నియోజకవర్గాలకు పోవడం లేదు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉండటం లేదు. అత్యంత సన్నిహితులకే వారి ఆచూకీ దొరకడం లేదు. మరో వైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ ప్రారంభించింది. నిందితుల్ని రెండు రోజుల కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు వాయిస్ శాంపిల్స్ తీసుకున్నారు.
అయితే ఇప్పుడు నెక్ట్స్ ఏంటి అన్నదానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలను ప్రశ్నించి వివరాలు రాబడితేనే పూర్తి వివరాలు తెలుస్తాయి. అసలు మొదట ఎవరు బేరం పెట్టారు అన్న దగ్గర్నుంచి కథను ప్రారంభించాల్సి ఉంటుంది. అది అసలు కేసులో కీలకం. బీజేపీ వైపు నుంచి ఆఫర్ వస్తే.. తిరుగు ఉండదు. ఎమ్మెల్యేలే్ ముందుగా ఎవరినైనా అప్రోచ్ అయ్యారంటే అది కూడా కీలకమే ..కాకపోతే రివర్స్‌లో. ఈ విషయం బయటపడాలంటే ముందు ఆ ఎమ్మెల్యేల్ని పోలీసులు ప్రశ్నించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన చేయలేదు.
ఫామ్‌హౌస్ డీల్ బయటపడినప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. అంతకు ముందే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే ట్రాప్ చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి.. ఆడియో, వీడియోల్లో ఉన్న మాటల మర్మాన్ని తెలుసుకోవడానికి పోలీసులు నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు ప్రశ్నించడం లేదనేది ఎక్కువగా విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న. ఆ నలుగురు ఫిర్యాదు దారులైనా సరే వారి దగ్గర్నుంచి వాంగ్మూలం తీుకోవాలి కదా అని అడుగుతున్నారు. కానీ పోలీసులు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు.
ఫామ్ హౌస్ కేసును నిశితంగా పరిశీలిస్తే.. సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఆడియో, వీడియోలు తప్ప.. ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఇంత మొత్తం దొరికిందని పోలీసులు ప్రకటించలేదు. ఇప్పటి వరకూ చెప్పలేదు కాబట్టి ఇక ముందు చెప్పరు. అంటే ఇక్కడ మనీ లావాదేవీలకు ఆధారం లేదు. అందుకే ఈ కేసు ఇలా నిర్వీర్యం అయిపోయినట్లేనన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.