హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై, పార్టీపై విమర్శలు చేసిన ప్రతిపక్షాల నాయకులమీద ఒంటికాలిమీద లేచి విరుచుకుపడే ఆ పార్టీ నాయకుడు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తీవ్ర వేదనకు గురయ్యారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో నిన్న జరిగిన ఓ సమావేశంలో ఆయన తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. ఆ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ అధ్యక్షతన జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభమయింది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశానికి హాజరైన ఎంపీ బాల్క సుమన్ వచ్చీ రావటంతోనే అధికారులపై మండిపడ్డారు. సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు అని చెప్పి ఉదయం 11 గంటలకే ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పెద్దపల్లి ఎంపీనని, ఆ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోనే ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. జిల్లాలో జరిగే చాలా కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వటంలేదని, ఇటీవల జాబ్ మేళా జరిగితే చెప్పలేదని, జిల్లాస్థాయి సమీక్షలకు సమాచారం ఇవ్వటంలేదని, మొన్న కేంద్రమంత్రి ఒకరు వచ్చిపోతే చెప్పలేదని మండిపడ్డారు. శిలా ఫలకాలు పెడుతున్నచోట తాటికాయంత అక్షరాలతో ఇతరుల పేర్లు పెడుతూ, తన పేరునుమాత్రం చివరన చేరుస్తున్నారని, అసలు ఎంపీ అనే పదానికి గౌరవం ఇవ్వటంలేదని, ప్రొటోకాల్ పాటించటంలేదని అన్నారు. తన పేరు చివర శర్మ, రావు, రెడ్డి అని తగిలించుకుంటేనే పిలిచి గౌరవిస్తారా అని ప్రశ్నించారు. అసలు ఎట్లా కనిపిస్తున్నానని అడిగారు. పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీ ద్వారా నోటీస్ ఇస్తే అధికారులంతా ఢిల్లీలో నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికార పార్టీ ఎంపీగా ఉన్న తాను ఇలా మాట్లాడాల్సివచ్చినందుకు బాధగా ఉందని, అధికారుల తీరుకు నిరసనగా వాకౌట్ చేసి వెళ్దామని వచ్చానని, కానీ మంత్రి ఈటెల, ఎంపీ వినోద్‌లను చూశాక ఆ పని చేయలేకపోతున్నానని దగ్ధ స్వరంతో అన్నారు. ఈ సమావేశానికి ఈటెల రాజేందర్, వినోద్తోబాటు చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, జడ్పీ ఛైర్ పర్సన్ ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, కలెక్టర్ నీతూ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు తదితరులుకూడా హాజరయ్యారు.
ఉస్మానియా విద్యార్థి నాయకుడుగా ఉన్న బాల్క సుమన్, ఉద్యమ సమయంలో టీఆర్ఎస్పై విమర్శలు చేసిన నాయకులు, సినీ ప్రముఖులపై దాడులు చేయటంద్వారా మంచి గుర్తింపు పొందారు. ఒక సందర్భంలో ఓ టీవీ ఛానల్ లైవ్ డిబేట్లో అమరవీరులకు టీఆర్ఎస్ అన్యాయం చేస్తోందని ఆరోపించినవారిపై దాడిచేసి సంచలనం సృష్టించారు. దళితుడవటం, కేసీఆర్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా అతిచిన్న వయసులోనే గత ఎన్నికలలో పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీ కవిత బ్యాగ్‌లు మోస్తుంటారని ఈయనను ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎద్దేవా చేస్తుంటారు. చిన్న వయసులో ఎంపీ అయిన సుమన్ గుర్తుంచుకోవలసింది ఒకటుంది. గౌరవం అనేది అడిగి తీసుకునేది కాదు, మన ప్రవర్తన, వ్యక్తిత్వాన్నిబట్టి ఎదుటివారు ఇచ్చేది. ఈ ప్రొటోకాల్, గౌరవాలమీదకన్నా ప్రజలకు సేవ చేయటంమీద దృష్టిపెడితే ఎంపీగా మీకు లభించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నవారవుతారు. తద్వారా వారి అభిమానాన్ని చూరగొని మళ్ళీ మళ్ళీ మిమ్ములనే ఎన్నుకునే అవకాశాలను చేజిక్కించుకుంటారు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సుమన్ ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణలోని అగ్రకులాలను – ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కులమైన వెలమ సామాజికవర్గాన్ని సవాల్ చేసినట్లయింది. తమ కులంపై సుమన్లో ఇంత ఆగ్రహావేశాలు ఉన్నాయా అని కేసీఆర్ తెలుసుకోటానికి సుమనే అవకాశం కల్పించారు. ఇలా తమ ఆధిపత్యాన్ని సవాల్ చేసేవారిని ఆయన ఎలా తొక్కేస్తారో అందరికీ తెలిసిన విషయమే. మరి సుమన్ ఏమవుతారో చూడాలి.