తెలంగాణ రాష్ట్రసమితి తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. డీఎస్ చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన పార్టీలో చేరితే ఆయన పదవిపై అనర్హతా వేటు పడే అవకాశం ఉంది. ఈ కారణంగా గతంలో కూడా సోనియాతో భేటీ అయినప్పటికీ కాంగ్రెస్‌లో చేరలేదు. డీఎస్ రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాది ముగిసిపోనుంది. ఆ తర్వాత ఆయన ఫ్రీగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇటీవల టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా డీఎస్‌తో సమావేశమయ్యారు. ఆయన కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతామని ప్రకటించారు. డీఎస్ కాంగ్రెస్‌లో చేరడం వల్ల పెద్దగా బలం వస్తుందన్న ఆశలేమీ లేకపోయినా బలమైన మున్నూరుకాపు వర్గం కాంగ్రెస్‌కే ఎక్కువ మద్దతుపలికే అవకాశం ఉంది. ఈ వర్గం టీఆర్ఎస్పై తీవ్ర అసంతృప్తితో ఉందన్న అభిప్రాయం ఉంది. దీంతో రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదిలినట్లుగా తెలుస్తోది.
డీఎస్ కాంగ్రెస్‌లో చేరితే టీఆర్ఎస్కే కాదు… బీజేపీకి కూడా ఇబ్బందే. డీఎస్ రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆయన కుటుంబసభ్యులు ఆయనను కాదని కాంగ్రెస్‌లో చేరితే … ఆయనకు ఇబ్బందికరమే. అయితే ఎవరి రాజకీయం వారిదే అని వారు చాలా కాలంగా చెబుతున్నారు. అయితే జరిగే ప్రచారం మాత్రం వేరుగా ఉంటుంది.