ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమనే విషయాన్ని కేంద్రప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రజలు కూడా దానిపై ఆశలు వదులుకొన్నారు. కానీ నేటికీ ఇంకా ఆ మాట వినపడుతోందంటే అందుకు కారణం రాష్ట్రంలో ప్రతిపక్షాలేనని చెప్పకతప్పదు. వైకాపా ఎం.పి. వై.వి.సుబ్బారెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్ సభలో నిన్న కోరినప్పుడు, అధికార తెదేపా, బీజేపీలకు చెందిన సభ్యులెవరూ ఆయనకి మద్దతుగా లేచి నిలబడి మాట్లాడలేదు. కానీ పొరుగు రాష్ట్రానికి చెందిన తెరాస ఎంపి జితేందర్ రెడ్డి ఆయనకి మద్దతుగా మాట్లాడారు. అందుకు ఆయనను అభినందించవలసిందే! అయితే ఆయన కూడా చిన్న మెలిక పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాము కోరుకొంటున్నామని కానీ ఒకవేళ ఏపికి ఇస్తే తెలంగాణా రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. దేశంలో రెండవ ధనిక రాష్ట్రమయిన తెలంగాణాకి కూడా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నపుడు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా మంజూరు చేస్తుందని ఆశించడం కూడా వృధాయే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని తెలంగాణా ప్రభుత్వం మనస్పూర్తిగా కోరుకొంటున్నట్లయితే ఇటువంటి షరతులు, మెలికలు పెట్టకుండా మద్దతు ఇస్తే అందరూ హర్షించేవారు.