ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత టిఆర్ఎస్ సభ్యులు మోడీ మంత్రివర్గంలో చేరతారని సాక్షి పతాక శీర్షిక నిచ్చింది. దాంతోపాటే ఎవరెవరు చేరేది పేర్లు కూడా ప్రకటించింది. అదే సమయంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి ప్రభుత్వంలో చేరడం లేదని ప్రకటించారు. సమస్యలను బట్టి తమ మద్దతువుంటుందని ఆయన చెప్పారు. ఏది ఏమైనా కేంద్రంతో సానుకూలత పెరిగిందనే సంకేతాలు ఆయన కూడా ఇచ్చారు. తెలంగాణలో బిజెపి నేతలైతే టిఆర్ఎస్ చేరిక ఖాయమనీ, ఇక తమ పరిస్థితి మరింత గందరగోళమవుతుందని భయపడుతున్నారు. దీని ఫలితంగా తమతో సంబంధాలు తెంచుకుంటారని తెలుగుదేశం భావిస్తున్నది. అయితే టిఆర్ఎస్ సీనియర్ ఎంపి ఒకరితో మాట్లాడినప్పుడు కేంద్రంతో తమ సంబంధాలలో ఎలాటి మార్పు లేదని నాతో చెప్పారు. మోడీ బృందంలో చేరే జాబితాలో వున్న ఆ నేత ఇవన్నీ వూహాగానాలేనని కొట్టిపారేశారు.