తెలంగాణాలో అన్ని సమస్యలకు తెదేపా-బీజేపీలు పొత్తులు పెట్టుకోవడమే మూలకారణమని నిజామాబాద్ తెరాస ఎంపి కవితమ్మ భలే కనిపెట్టేశారు. తన తండ్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన తరువాత ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కృషి చేస్తుంటే దానికి తెదేపా అవరోధాలు సృష్టిస్తోందని, వారి పార్టీతో బీజేపీ పొత్తులు పెట్టుకొన్న కారణంగా బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న తెదేపాతో చేతులు కలిపి ముందుకు సాగితే దాని వలన బీజేపీయే ఎక్కువ నష్టపోవలసి వస్తుందని ఆమె అన్నారు.
ఆమె తన మనసులో మాటని చాలా అందంగా పొందికగా చెప్పడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. తనకి కేంద్రమంత్రి పదవి చేప్పట్టాలనే కోరిక ఉందని ఇదివరకే ప్రకటించేశారు. కానీ ఎన్డీయే కూటమిలో భాగస్వామి కాకుండా అది సాధ్యం కాదు కనుక ఆమె ఈ సరికొత్త సిద్దాంత్తాన్ని ఆవిష్కరించినట్లున్నారు. తెదేపాతో బీజేపీ జత కట్టడం తమ పార్టీకి ఏమాత్రం నచ్చడం లేదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తమతో బీజేపీ చేతులు కలిపితే బాగుంటుందని ఆమె పరోక్షంగా సూచిస్తున్నప్పటికీ, పరమార్ధం మాత్రం కేంద్రమంత్రి పదవేనని భావించవచ్చును. ఎందుకంటే తెదేపాతో బీజేపీ కటీఫ్ చేసుకొంటే తరువాత జరిగేది అదే కనుక. అసలు విషయాన్ని దాచిపెట్టి కొసరు విషయాన్ని ఇంత గొప్పగా చెప్పడం మామూలు విషయమేమీ కాదు.