ఒక్కోసారి చాలా తెలివయిన నేతలు కూడా అనవసరమయిన మాటలు మాట్లాడి ఇబ్బందుల్లో పడతారు. ఆ ఇబ్బంది వారి వరకే పరిమితమయితే పరవాలేదు. కానీ వారి మాటల వలన ఒక్కోసారి పార్టీకి కూడా ఇబ్బంది, నష్టం కలిగిస్తుంటారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు మరియు మంత్రి కె.టి.ఆర్. నిన్న కూకట్ పల్లిలో గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో ఆంధ్రా ప్రజలను ఆకట్టుకొనే విధంగా మాట్లాడితే, ఆయన సోదరి ఎంపి కవిత పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడారు.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు తేదీలు కూడా ఖరారు అయిపోయిన తరువాత ఆమె అలవాటు ప్రకారం ‘ఆంధ్రోళ్ళు’ అంటూ మాట్లాడారు. ఆంధ్రోళ్ళు ఎక్కువగా ఉన్నారని ప్రతిపక్షాలు హైదరాబాద్ లో ఆంధ్రోళ్ళ చేతనే ప్రచారం చేయిస్తాయిట! అని వెటకారంగా మాట్లాడేరు. తెరాస నేతలు ఇప్పుడు హైదరాబాద్ స్థిరపడిన ఆంధ్రా ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంచిగా మాట్లాడుతున్నప్పటికీ, ఆంద్ర ప్రజల పట్ల వారికి ఎటువంటి అభిప్రాయం ఉందో..వారంటే తెరాస నేతలకు ఎంత చులకనో కవిత మాటలు తెలియజేస్తున్నాయి. వారికి ఆంధ్రా ప్రజల పట్ల ఎటువంటి దురభిప్రాయం ఉన్నప్పటికీ, చులకన భావం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎన్నికలు మీద పడ్డాయి కనుక వారిని ఉద్దేశ్యించి ఎవరూ ఇంత చులకనగా మాట్లాడాలనుకోరు. మాట్లాడితే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. ఈ సంగతి మంచి రాజకీయ అనుభవం వాక్చాతుర్యం ఉన్న కవితకు తెలియకనే ఆంధ్రోళ్లు అంటూ చులకనగా మాట్లాడారనుకోవాలా?
అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆమె చాలా చులకనగా మాట్లాడేరు. “అతను ఎన్నికల సమయంలో గంగిరెద్దులా బుర్ర ఊపుకొంటూ వస్తాడు. ఎన్నికలయిపోగానే మాయం అయిపోతుంటాడు. ఎన్నికలు మొదలవగానే మేకప్, ముగియగానే ప్యాకప్” అని ఎద్దేవా చేసారు. తల తిక్క పవన్ కళ్యాణ్ కు తన తండ్రి కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారని చెప్పారు. అంటే తమని విమర్శించినందుకు పవన్ కళ్యాణ్ న్ని తన తండ్రి కేసీఆర్ ఆయనని వేధించారని కవిత చాటింపు వేసుకొంటున్నట్లుంది. అది ప్రజలకు ఎటువంటి తప్పుడు సంకేతం పంపిస్తుందో ఊహించవచ్చును.
పవన్ కళ్యాణ్ కి ఆంధ్రాలోనే కాదు..తెలంగాణాలో కూడా, ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలలో చాలా మంది అభిమానులు ఉన్నారనే సంగతి అందరికీ తెలుసు. అటువంటప్పుడు ఆయన గురించి ఇంత చులకనగా మాట్లాడితే వారు ఏవిధంగా స్పందిస్తారో ఊహించడం కష్టమేమీ కాదు. అయినా పవన్ కళ్యాణ్ తానేమీ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తానని ఎన్నడూ చెప్పుకోలేదు. తెదేపా, బీజేపీలు ప్రచారం చేయమని అడిగినా ఆయన అందుకు అంగీకరించలేదని వార్తలు వచ్చేయి. అటువంటప్పుడు ఈ ఎన్నికలతో ఎటువంటి సంబంధమూ లేని పవన్ కళ్యాణ్ గురించి కవిత అంత చులకనగా మాట్లాడటం ఎందుకు? దాని వలన ఎవరికి నష్టం కలుగుతుందో ఆమె ఊహించలేరా?
కేసీఆర్ తో సహా తెరాస నేతలందరూ ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్రా ప్రజలను ప్రసన్నం చేసుకొని జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలవాలని ఆపసోపాలు పడుతుంటే, మంచి తెలివయిన నేతగా పేరున్న కవిత ఈవిధంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఆమె ఇదే ధోరణిలో ఇంకా మాట్లాడినట్లయితే, ఈ ఎన్నికలలో గెలవడానికి ఏడాదిగా తెరాస చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చును.