ఆంధ్రా మీడియాని తీవ్రంగా అసహ్యించుకొనే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే ఆంధ్రా మీడియా అధినేత రామోజీ రావుతో సమావేశం అవడం, అదే విధంగా రామోజీరావుని, ఈనాడు మీడియాని ద్వేషించే జగన్మోహన్ రెడ్డి కూడా ఫిలిం సిటీ వెళ్లి రామోజీ రావుతో సమావేశం అవడం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి తెలంగాణాకి తీరని ద్రోహం అన్యాయం చేసారని వాదించే తెరాసకు చెందిన కవిత లోటస్ పాండ్ వెళ్లి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవడం చూస్తుంటే చాలా విచిత్రంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి రహస్య సమావేశాల పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రాజకీయ సమీకరణాల మార్పులకి, వ్యూహాలకి దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.
తెరాస ఎంపీ కవిత లోటస్ పాండ్ కి వెళ్లి నిన్న జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. తెరాస పార్టీ తరపున ఆమె వైకాపా అధ్యక్షుడు జగన్ తో మంతనాలు చేయడానికి వెళ్ళినట్లు చెప్పేబదులు దానినే అందంగా మరో విధంగా చెప్పారు. తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత సాక్షి మీడియా చైర్ పర్సన్ శ్రీమతి వై.యస్. భారతిని కలిసి ఆమెను బ్రతుకమ్మ ఆడేందుకు ఆహ్వానించడానికే వెళ్ళారని తెరాస, వైకాపా నేతలు చెప్పుకొంటున్నారు. ఆ సందర్భంగా అక్కడే ఉన్న జగన్మోహన్ రెడ్డితో కూడా ఆమె కాసేపు మాట్లాడారుట!
అదే నిజమయితే హైదరాబాద్ లో ఉన్న మిగిలిన మీడియా సంస్థల అధినేతల ఇళ్ళకు కూడా వెళ్లి వారి భార్యలను, ఆడపిల్లలను కూడా ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించుకొంటే కాదనే అర్ధం అవుతుంది. కనుక ఇది తెరాస-వైకాపా నేతల మధ్య జరిగిన సమావేశమని అర్ధం అవుతుంది. అప్పుడు దాని అంతర్యం ఏమిటనే మరో సందేహం కలుగుతుంది. బహుశః జి.హెచ్.యం.సి.ఎన్నికలలో వైకాపా సహకారం కోసమేనని భావించాల్సి ఉంటుంది.
ఈ ఎడాదిన్నార తెరాస పాలనలో హైదరాబాద్ జంట నగరాలలో నివసిస్తున్న ఆంధ్ర ప్రజల నమ్మకాన్ని అభిమానాన్ని పొందే ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తన చర్యల ద్వారా, సూటిపోటి అవమానకరమయిన మాటలతో వారిలో అభద్రతా భావాన్ని పెంచి పోషించారు. కనుక జి.హెచ్.యం.సి. ఎన్నికలలో వారి ఓట్లను తెరాస ఆశించలేదు. బహుశః అందుకే ఆంధ్రాకు చెందిన వైకాపా సహకారం కోరుతుండవచ్చును.
తెలంగాణా రాష్ట్రంలో వైకాపా తన ఉనికిని కాపాడుకోవడానికి తెరాస అనుమతించడానికి కారణం బహుశః దాని నుండి ఇటువంటి సహకారాన్ని ఆశించేనని భావించాల్సి ఉంటుంది తెరాస, వైకాపాల ఉమ్మడి శత్రువు తెదేపా దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కనుక వారిని ఎదుర్కోవడానికి ఆ రెండు పార్టీలు చేతులు కలపడం విచిత్రమేమీ కాదు. కనుక బ్రతుకమ్మ ఆటకు భారతిని ఆహ్వానించడం అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని అనుమానం కలుగుతోంది. ఒకవేళ బ్రతుకమ్మ పండుగలో భారతి కూడా వచ్చి పాల్గొంటే, హైదరాబాద్ లో ఉన్న వైకాపా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతల ఆడవాళ్ళు కూడా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా కూడా తెరాసకు చాలా ప్రయోజనం కలుగవచ్చును.