ఓ వైపు హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతూంటే మరో వైపు టీఆర్ఎస్ ఆ పార్టీకి చికాకు పుట్టేలా కార్యక్రమాలు చేస్తోంది. ప్రచారం రాకుండా చేస్తోంది. బ్యాంకుల్ని దోచుకున్నవారు వేరే.. అసలు దేశాన్నే మోడీ దోచేస్తున్నారని మనీహీస్ట్ క్యారెక్టర్లతో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఇలా ఉండగానే ఈడీ నుంచి టీఆర్ఎస్కు ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. అదేమిటంటే… టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థల ఆస్తులను జప్తు చేయడం.
రాంచీ ఎక్స్ప్రెస్ వే కేసులో మధుకాన్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.96 కోట్ల విలువైన మొత్తం 105 ఆస్తులు అటాచ్ చేసినట్లుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్ లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు వున్నాయి. రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు వున్నాయి.
అయితే అప్పట్లో సైలెంట్ అయిపోయిన ఈడీ ఇప్పుడు హఠాత్తుగా అటాచ్ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ఏదో సిగ్నల్ పంపారనే అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీపై దూకుడుగా వెళ్తున్న టీఆర్ఎస్కు ముందు ముందు చాలా ఉంటాయని.. ఈడీ ఎంపీ నామా విషయంలో టెస్ట్ డ్రైవ్ మాత్రమే చేసిందని బీజేపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ కు అయినా ఈ మ్యాటర్ అంత తేలిగ్గా తీసుకునేది కాదని తెలిసే ఉటుంది.