ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకొని కొంతమంది మంత్రులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మొండి వైఖరితోనే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె విరమణకు సయోధ్య ఎక్కడి నుంచి ఎలా మొదలౌతుందనే సందిగ్ధం కొనసాగుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు తెరాస పార్లమెంటరీ నేత, సీనియర్ నాయకుడు కె. కేశవరావును సీఎం కేసీఆర్ రంగంలోకి దించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ఆయన సిద్ధపడ్డారు. ఆర్టీసీ సమస్యలపై మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొస్తున్నట్టు కేకే ప్రకటించారు.
ఆర్టీసీ కార్మికుల బలిదానాలు బాధిస్తున్నాయనీ, సమస్యకు ఆత్మహత్యలు పరిష్కారం కావని కేకే అన్నారు. ఆర్టీసీలో ఇకపై 50 శాతం సొంత బస్సులు, మిగతా యాభైలో 20 శాతం ప్రైవేటు బస్సులు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేకే స్పందిస్తూ… ప్రస్తుతం జరుగుతున్న సమ్మె దృష్ట్యా ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదన మాత్రమే అది అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పరిస్థితులు చేయిదాటక ముందే సానుకూలంగా చర్చించుకుందామని కేకే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేకే ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు కూడా ఒక మెట్టు దిగొచ్చినట్టుగానే కనిపిస్తోంది. కేకే అంటే తమకు గౌరవమనీ, ఉద్యమ సమయంలో ఆయన చాలా కృషి చేశారనీ, ఆయన మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదే అంటూ ఆర్టీసీ జేయేసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. కేకే ఆహ్వానిస్తే చర్చలకు వస్తామనీ, మంత్రులు కొందరు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు.
కేకే ప్రతిపాదన నేపథ్యంలో అటు ప్రభుత్వం ,ఇటు ఆర్టీసీ కార్మికులు ఒక అడుగు వెనక్కి తగ్గి చర్చలకు సిద్ధమౌతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ చర్చల కోసమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చేసినట్టు సమాచారం. అయితే, ప్రభుత్వంలో విలీనం అనేదే ఇప్పటికీ ఆర్టీసీ యూనియన్ల ప్రధానమైన డిమాండ్. అది మినహా మిగతా అంశాలపై సానుకూలంగా స్పందించాలనే ఉద్దేశంతో కేకే మధ్యవర్తిత్వానికి ప్రభుత్వం పంపుతున్న పరిస్థితి! ఏదేమైనా రెండువైపు నుంచి పట్టు విడుపు వాతావరణమైతే కనిపిస్తోంది. మరి, కేకే మధ్యవర్తిత్వం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.