బీజేపీపై పార్లమెంట్లో యుద్ధమే అంటున్న టీఆర్ఎస్ చివరికి గ్రౌండ్ నుంచి తప్పుకోవాలని డిసైడయింది. లోక్‌సభ, రాజ్యసభల్లో నూ బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి కారణంగా ప్రధాని మాటలనే ఉపయోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలో రూల్ 187 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. తర్వాత రాజ్యసభ ప్రారంభం కాగానే.. టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సభా హక్కుల నోటీసుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుపతి పర్యటనలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఉన్నారు. దీంతో ఆయన నిర్ణయం తీసుకుంటారనిడిప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు. చైర్మెన్ పరిశీలన కోసం ప్రివిలేజ్ నోటీసును పంపినట్లు ఆయన చెప్పారు. అయితే టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అంగీకరించలేదు. ప్రివిలేజ్ నోటీసుపై ఛైర్మన్ నిర్ణయం తీసుకునే వరకు సభకు వెళ్లకూడదని నిర్ణయించి రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. లోక్‌సభలోనూ ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు డిసైడయ్యారు.
ప్రివిలేజ్ నోటీసుపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు సభను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్ ఎంపీల తీరుతో ఇతర పార్టీలు షాక్‌కు గురయ్యాయి. ప్రివిలేజ్ నోటీసులపై నిర్ణయం తీసుకోకపోతే ఇక పార్లమెంట్‌కు రారా అని సెటైర్లు వేసుకుంటున్నారు. బీజేపీపై టీఆర్ఎస్ పోరాటంలో చిత్తశుద్ధి లేదని విమర్శించే వారికి ఇలాంటి నిర్ణయాలు బాగా ఉపయోగపడుతున్నాయి.