టిఆర్ఎస్ నుంచి అయిదారుగురు ఎంపిలు బిజెపిలో దూకాలని ఎదురు చూస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ గెలిచినా మాకు కలిగే ప్రయోజనం శూన్యమని వారు అంటున్నారట. కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా తాము అధికార పీఠాలకు దూరంగా ఎక్కడో వుండిపోవాల్సి వస్తుందని ఈ ఎంపిల ఘోష. కెసిఆర్ కుటుంబ సభ్యులు కొందరు చక్రం తిప్పుతుంటే – తర్వాత మంత్రులు వుంటే- ఆ తర్వాత స్థానంతో సర్దుకోవలసి వస్తుందట. పైగా ఆర్థికంగా లాభదాయక మైన అంశాలు తమ దాకా రావడమనే ప్రసక్తి లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. టిఆర్ఎస్ నెమ్మదిగా కేంద్రంలో చేరుతుందనే ఆశతో ఇంతకాలం నిరీక్షించినా ప్రధాని మోడీ ఆ అవకాశం ఇవ్వబోరని వీరు నిర్ధారణకు వచ్చారు. పైగా అక్కడా కవిత పేరే ముందు వినిపిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీ కవితను మాత్రం మంత్రిని చేయరని లోగడ తమతో సంబంధం వున్న టిఆర్ఎస్ ఎంపిల వైపు ఆయన మొగ్గు చూపుతారని బిజెపి నాయకులొకరు అన్నారు.
అంతేగాక వచ్చే దఫా టిఆర్ఎస్ టికెట్ మళ్లీ రావడం కష్టమనుకుంటున్న ఎంపిలు కూడా బిజెపిలో చేరడం అనివార్యమనుకుంటున్నారట. ఇలాటి వారంతా అమిత్ షాతో గాని లేక ఆయన పురమాయించిన వారితో గాని టచ్లో వుండి సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నది టిఆర్ఎస్ నాయకులు కూడా కొందరైనా ధృవీకరిస్తున్నారు. అలా టికెట్ నిరాకరించబడే పేర్లు కొన్ని వున్నాయి.