హైదరాబాద్ నగర మేయర్ పీఠం పొందేందుకు టీఆర్ఎస్ అనేకానేక మార్గాలను అన్వేషిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడంలో టీఆర్ఎస్ విఫలమయింది. అదే సమయంలో వంద శాతం ఓటమి కూడా రాలేదు. ఎలాంటి సమీకరణాలు చూసినా గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్కే దక్కుతుంది. కానీ.. రాజకీయంగా నష్టం జరగకుండా ఆ పీఠాన్ని ఎలా పొందాలన్నదే ఇప్పుడు టీఆర్ఎస్ ముందున్న అతి పెద్ద టాస్క్. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ సృష్టించిన రాజకీయ వాతావరణం కారణంగా.. కనీసం ఎంఐఎం నీడ కూడా.. టీఆర్ఎస్పై పడకుండా చూసుకోవాలి. అందుకే.. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఎంఐఎం సహకారం లేకుండానే మేయర్ పీఠం పొందాలనుకుంటున్నారు.
ఎక్స్‌ఆఫిషియో సభ్యులతో కలిపినా… వంద మంది సభ్యులు కాకపోవడంతో… టీఆర్ఎస్కు ఇతరుల నుంచి సపోర్ట్ అవసరం. ఒక్క ఫోన్‌కాల్ చేస్తే.. ఎంఐఎం మద్దతివ్వడానికి రెడీగా ఉంటుంది. మద్దతు తీసుకోలేకపోయినా.. కనీసం ఓటింగ్‌కు దూరంగా ఉండమన్నా ఉంటుంది. కానీ అలాంటి సాయం కూడా తీసుకోవడానికి టీఆర్ఎస్ ఇష్టపడటం లేదు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను టీఆర్ఎస్ రెడీ చేసుకుంది. చేతులెత్తే పద్దతిలో మేయర్ ఎంపికను నిర్వహించి.. ఎవరికి ఎక్కువ మంది కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో ఓటర్ల మద్దతు ఉందో.. వారికే పీఠం అప్పగించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
150 మంది కార్పొరేటర్లు, యాభైకి పైగా ఉన్న ఎక్స్ అఫీషియో ఓటర్లు మొత్తం హాజరైతే.. మెజార్టీ మార్క్ వంద దాటాలి. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. కాకుండా… మేయర్ అభ్యర్థిని నేరుగా ఎంపిక చేసుకుంటే… టీఆర్ఎస్ తరపున మేయర్ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వస్తాయి. బీజేపీ తరపున.. ఎంఐఎం తరపున మేయర్ అభ్యర్థులుగా ఎవరైనా నిలబడితే.. వారి వారి ఓట్లు వస్తాయి. ఆ ప్రకారం చూస్తే.. టీఆర్ఎస్కే మెజార్టీ ఉంటుంది.ఈ పద్దతిలో ఎన్నిక నిర్వహిస్తే సమస్య పరిష్కారంఅవుతుందని టీఆర్ఎస్ పెద్దలు అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. సమయం దగ్గర పడుతూండటంతో… ఓ వ్యూహాన్ని ఫైనల్ చేయాల్సిన పరిస్థితిలో టీఆర్ఎస్ పెద్దలు పడ్డారు.