తెలంగాణ రాష్ట్ర సమితిలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈటల రాజేందర్ మాత్రమే కాదని..మరో మంత్రికి త్వరలో అలాంటి ట్రీట్మెంట్ ఎదురవబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రి ఎవరో కాదు.. జగదీశ్వర్ రెడ్డి. నిన్నటిదాకా .. ఓ మంత్రి అంటూ.. ప్రచారం చేసిన మీడియా… టీఆర్ఎస్ అనుకూల మీడియా.. ఇప్పుడు పేరుతో సహా ప్రచారం చేయడం ప్రారంభించింది. ఆయనేం తప్పు చేశారో కూడా చెబుతోంది. మంత్రి జగదీష్ రెడ్డి.. గత జనవరిలో తన కుమారుడు పుట్టినరోజు వేడుకల్ని కర్ణాటకలోని హంపిలో ఉన్న ఓ రిసార్ట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురైదుగురు ఎమ్మెల్యేలతో పాటు…అత్యంత సన్నిహితులైన కొంత మందిని తీసుకెళ్లారు. అక్కడ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి.
అయితే.. ఆ సమయంలో జగదీశ్వర్ రెడ్డి.. కేసీఆర్ గురించి.. ఆయన పార్టీని హ్యాండిల్ చేయడం గురించి.. పార్టీలో కుటుంబసభ్యులకు ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రైవేటుగా జగదీష్ రెడ్డితో పాటు ఇతర నేతల మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో జగదీష్ రెడ్డి.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను … జర్నలిస్టు నుంచి ఎమ్మెల్యేగా మారిన ఓ నేత వీడియో తీశారు. నేరుగా సీఎంకు అందేలా చేశారు. అప్పట్నుంచి.. కేసీఆర్.. జగదీశ్వర్ రెడ్డి మధ్య గ్యాప్ పెరిగిందని చెబుతున్నారు.
ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి పరిస్థితి కూడా ఈటాల లాగే అవబోతోందని.. టీఆర్ఎస్ అనుకూల మీడియాలోనే ప్రచారం జరుగుతూండటంతో… ఈ పరిస్థితిని ఇతర పార్టీల నేతలు అనుకూలంగా మల్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి… ఈ మేరకు ఓ ట్వీట్ చేసి… జగదీశ్వర్ రెడ్డి వీడియోను బయట పెట్టిన ఎమ్మెల్యే ఎవరో పరోక్షంగా చెప్పారు. ఇప్పుడీ వ్యవహారం..టీఆర్ఎస్లోనే సంచలనం అవుతోంది.