ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు.. జలగం ప్రసాదరావు కొద్ది రోజుల కిందట టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ తరపున ఆయన కొత్త గూడెం నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి టిక్కెట్ సాధ్యం కాదని చెప్పడంతో… అసంతృప్తికి గురై టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు. ఇదే అందరికి ఆశ్చర్యం కలిగించింది. కొత్తగూడెం నుంచి… జలగం సోదరుడే… టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కానీ ఇద్దరికీ పడదు. అయినప్పటికీ.. జలగం ప్రసాదరావుకు ప్రత్యేకమైన వర్గం ఉండటం.. గెలుపు ప్రతిష్టాత్మకంగా కావడంతో.. తుమ్మల కాస్త తగ్గి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పార్టీలోకి వచ్చారు. కానీ.. ఇప్పుడు తుమ్మలకు అసలు టెన్షన్ ప్రారంభమయింది.
సత్తుపల్లిలో గెలుపు.. తుమ్మలకు.. అత్యంత కీలకంగా మారింది. అక్కడ గెలవకపోతే.. పరువు పోతుందని ఆయన కార్యకర్తలకు మొరపెట్టుకుంటున్నారు. సత్తుపల్లిలో మూడేళ్లుగా తుమ్మల వర్సెస్ పొంగులేటి అన్నట్లుగా సాగుతోంది. ఇప్పుడు వారికి జలగం వర్గం వచ్చి చేరింది. జలగం ప్రసాదరావు టీఆర్ఎస్లో చేరడంతో ఆది నుంచి జలగాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న తుమ్మల వర్గంలో అంతర్మథనం ప్రారంభమైంది. జలగం ప్రసాదరావు ప్రాబల్యం అధికంగా ఉండే పెనుబల్లి మండలంలో తుమ్మలను నమ్ముకున్నవారు.. టీడీపీ గూటికి చేరుతున్నారు. దీనికి కారణం.. జలగం.. తుమ్మల వర్గీయుల్ని అవమానిస్తూండటమే. ఓ ప్రచార కార్యక్రమంలో తుమ్మలకు అత్యంత సన్నిహితుడైన నేత మాట్లాడుతూంటే… మైక్ లాగేసుకున్నారు. కొంత మందిపై అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగానే.. ఏం జరిగిందో కానీ… హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి జలగం ప్రసాదరావు గత రెండు రోజుల క్రితం జరిగిన కేటీఆర్ పర్యటనలో పాల్గొనలేదు. పైగా శుక్రవారం తన మద్దతు దారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎక్కడా టీఆర్ఎస్ జెండా కానీ, తుమ్మల, పొంగులేటి వర్గీయులు కాని లేరు. జలగాన్ని వ్యతిరేకించిన నాయకులు టీడీపీలో చేరడం, పొంగులేటి వర్గీయులు ప్రచారానికి దూరంగా ఉండటంతో టీఆర్ఎస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. జలగం ప్రసాదరావు చేరికతో బలం వస్తుందనుకుంటే.. మొత్తానికే సమీకరణాలు మారిపోయే పరిస్థితి రావడం.. తుమ్మలకు ఇబ్బందికరంగా మారింది.